భీమ్‌గల్, ఫిబ్రవరి 22 : బంజారాలకు బాల్కొండ నియోజక వర్గంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌లో బంజారాలకు ఆత్మగౌరవ భవనం ఉంది. అటు తర్వాత నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోనే భవనాన్ని నిర్మించారు. బంజారాలకు నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనం. ఒకప్పుడు బంజారాలు అంటే గుట్టల్లో ఉండేవారు వారికి సరైన వసతి, రోడ్డు సౌకర్యం, కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పు డు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
స్వరాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక బంజారాల బతుకుల్లో వెలుగులు నిండాయి. ఇచ్చిన మాట ప్రకారం తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడంతో పాటు సౌకర్యాలు మెరుగుపర్చడం కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారు. అలాగే తండాల నుంచి పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చేవారికి సరైన వసతి సౌకర్యం ఉండేది కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండల కేంద్రంలో రూ.50లక్షల నిధులతో బంజారా భవన్‌ను నిర్మించారు. దీంతో పనుల కోసం మండల కేంద్రానికి వచ్చేవారి తిప్ప లు తీరినట్లయ్యింది. బంజారా భవన్లో వసతి సౌకర్యంతో పాటు గిరిజనులు వారి సమావేశాలు నిర్వహించుకోవడానికి ఒక వేదిక సిద్ధం అయ్యింది. ఈ భవనం నిర్మాణంతో చుట్టు పక్కల గిరిజన గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణానికి సహకరించి నిధులు మంజూరు చేసిన మంత్రి వేములకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
నేడు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటన
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 22 : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు వేల్పూర్ పెద్దవాగుపై రూ.15 కోట్లతో నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి, 9.30 గంటలకు మోతె కప్పలవాగుపై రూ.12 కోట్లతో నూతనంగా నిర్మించిన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటలకు భీమ్‌గల్ మున్సిపాలిటీలో రూ.50లక్షలతో నూతనంగా నిర్మించిన బంజారా భవన్‌ను ప్రారంభించారు. అనంతరం శ్రీ సంత్ సేవలాల్ మహరాజ్ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొంటారు.
గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు..
గతంలో ఏ ప్రభుత్వాలు మమ్ములను పట్టించుకోలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సీఎం కేసీఆర్ మా ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు బంజారా భవనాన్ని కూడా నిర్మించడం చాలా గొప్ప విషయం. పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే వారు ఇక్కడే ఉండాల్సి వస్తే సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమావేశాలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేకుండా పోయింది. ఈ బాధల నుంచి మాకు విముక్తి లభించింది. మంత్రి ప్రత్యేక చొరవతో రూ.50లక్షల నిధులు మంజూరు చేయించి బంజారా భవనాన్ని నిర్మించారు.
-శర్మనాయక్, బంజారా సేవా సంఘం మండల అధ్యక్షుడు
మంత్రికి రుణపడి ఉంటాం..
నాకు తెలిసి మా గురించి పట్టించుకున్న ప్రభుత్వాలను నేను ఎన్నడూ చూడలేదు. మా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, రోడ్లు, నీటి వసతి కల్పించిండ్రు. చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడైన భీమ్‌గల్ పోతే ఉండడానికి వసతి లేక చాలా ఇబ్బది పడ్డాం. మా బాధలు తీర్చిన మంత్రికి రుణపడి ఉంటాం.
-మూడావత్ సరోజా ,కారేపల్లి