కమ్మర్పల్లి, మార్చి 29: బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఉమ్మడి పాలకుల ప్రభుత్వాల హయాంలో అనుభవించిన అభివృద్ధి వివక్షను తుడిచి పెడుతూ స్వరాష్టం సిద్ధించాక ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గానికి కొండంత అభివృద్ధిని అందించారు. వ్యవసాయాధారమైన నియోజకవర్గం కావడంతో ప్రధానంగా అవసరమైన సాగునీటిని ముందుగా అందించే కార్యక్రమాలతో మొదలు కరెంటు కష్టాలను తప్పించేలా కొత్తగా 15 విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించి, ఎడారిలా మారిన వాగుల్లో అడుగడుగునా చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయించి, మూలనపడ్డ ఎత్తిపోతల పథకాలను గాడిన పెట్టించి, అటవీ ప్రాంతంలోని మానాల-మరిమడ్ల లాంటి రోడ్లను సైతం సాధించి అందించిన అభివృద్ధి ప్రజల కండ్ల ముందే ఉన్నది. దవాఖానలకు ఎక్కడా లేని విధంగా ప్రాణ వాయువులు ఊది, వంద పడకల దవాఖానను సాధించి వైద్యరంగాన్ని బలోపేతం చేసిన తీరు ఎంతో ప్రత్యేకం. దాట లేని వాగులు, కాలువలపై భారీ వంతెనలతో నిరంతర ప్రయాణ సౌకర్యం కలుగడం అభివృద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు. అన్నివర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తూ లింబాద్రి గుట్ట, ఆలయాలు, మసీదులు, చర్చిల్లో అభివృద్ధి పనులు జరిగాయి. దుబ్బ రేగిన రోడ్లు, రోడ్ల పైనుంచి పారే మోరీలు ్త, బిందెడు తాగునీటికి పొద్దంతా నల్లా దగ్గర లైను కనిపిస్తే.. అదే భీమ్‌గల్ అనే వారు నాడు. అలాంటి భీమ్‌గల్ నేడు మున్సిపాలిటీగా మారి అద్దం లాంటి రోడ్లతో మెరుస్తున్నది.
రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగతంగా అందిస్తున్న సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అత్యవసర ప్రతిస్పందనా అంబులెన్స్ ఎందరికో ఆపద్బాంధవిగా నిలుస్తున్నది. పీహెచ్‌సీల్లో ఆక్సిజన్ బెడ్లతో ప్రాణాలను నిలుపుకొనే సౌకర్యం కలిగింది. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం అందిస్తున్న స్వర్గ రథ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. కొవిడ్ విపత్తు వేళ బాధితులకు ఆహారం అందించడం, ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు నిత్యాన్నదానం, నిత్యావసర సరుకులు అందించారు. ప్రజా కల్యాణ మండపాల్లో సామగ్రి, ఫర్నీచర్ అందిస్తున్నారు. సర్కారు కొలువుల నోటిఫికేషన్లు మొదలైన వెంటనే నియోజకవర్గంలోని 500 మంది అభ్యర్థులకు లక్షల రూపాయల సొంత ఖర్చుతో మూడు నెలల పాటు ఉచిత కోచింగ్, భోజనం, డిజిటల్ మెటీరియల్ అందజేశారు. తాజాగా నియోజకవర్గంలోని రెండు వేల మంది పదో తరగతి విద్యార్థులకు డిజిటల్ మెటీరియల్ అందించేందుకు సిద్ధమయ్యారు.
వైద్యరంగంలో ఆదర్శంగా..
వైద్య రంగం గణనీయంగా బలపడింది. ఇందులో మంత్రి కృషి మరువలేనిదిగా ప్రజలు చెప్పుకొంటారు. భీమ్‌గల్‌లో వంద పడకల దవాఖాన మంజూరు చేయించి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేర్చారు. ప్రభుత్వ దవాఖాన లేక ప్రసవాలకు, ప్రమాదాలు జరిగినప్పుడు ఎడ్లబండ్లపై 40, 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ మార్గమధ్యలో మృత్యువాత పడ్డ దయనీయ వైనాలు జగిరిన మానాలలో ఏకంగా పీహెచ్సీ ఏర్పాటైంది. ముచ్కూర్, ఏర్గట్ల, మోతె తదితర ప్రాంతాల్లో కొత్త పీహెచ్‌సీలతోపాటు ఎన్నో సబ్ సెంటర్లకు సొంత భవనాలు మంజూరయ్యాయి. కొవిడ్ విపత్తు సమయంలో మంత్రి వేముల తన స్నేహితుల సహకారంతో రూ.కోటిన్నర వ్యయంతో నియోజకవర్గంలోని ప్రధాన పీహెచ్‌సీలను ఆక్సిజన్ బెడెడ్ హాస్పిటళ్లుగా మార్పించారు. మంత్రి చేసిన ఈ కృషి.. రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మంత్రి వేముల సొంత డబ్బులతో అందించిన అత్యవసర ప్రతిస్పందన అంబులెన్సు నియోజకవర్గంలో వెల కట్టలేని సేవలు అందిస్తున్నది. ఖరీదైన వైద్యం చేయించుకున్న 10 వేల మందికి పైగా పేదలకు రూ.42 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద మంత్రి మంజూరు చేయించారు. భీమ్‌గల్‌కు డయాలసిస్ సెంటర్ మంజూరైంది.
భీమ్‌గల్ మున్సిపాలిటీలో ప్రగతి..
నియోజకవర్గంలో ఏకైక మున్సిపాలిటీ భీమ్‌గల్. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేసి భీమ్‌గల్‌ను మున్సిపాలిటీగా చేయడంతోపాటు అభివృద్ధి, సదుపాయాల కల్పనతో భీమ్‌గల్ దశ తిరిగింది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో రూ.25 కోట్ల ప్రత్యేక నిధులు సాధించారు. దీంతో రోడ్ల పై పారే మురికి నీరు, గుంతలు, బురదమయంగా ఉండే మట్టి రోడ్లు కనిపించే భీమ్‌గల్‌లో గల్లిగల్లీకి సీసీ రోడ్లు, అవసరమైన చోట బీటీ రోడ్లు, డైనేజీల నిర్మాణం పెద్ద ఎత్తున జరిగింది. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం జరుగుతున్నది. వీటితోపాటు మరిన్ని నిధులు మంజూరు చేయించి భీమ్‌గల్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు మంత్రి వేముల. గుడ్డి దీపాల్లా ఉండే పట్టణంలో సెంట్రల్ లైటింగ్ వెలుగులు విరజిమ్ముతున్నాయి.
అన్నివర్గాలకు చేయూత..
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలోని అన్నివర్గాల వారికి అభివృద్ధిలో చేయూతను అందిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 53 హిందూ దేవాలయాలకు రూ.12 కోట్లు మంజూరు చేయించారు. 27 చర్చిలకు రూ.1.72 కోట్లు, 39 మసీదులు, ఈద్గాలకు రూ.2.81 కోట్లు, 15 షాదీఖానలకు రూ.1.73 కోట్లు మంజూరు చేయించారు. భీమ్‌గల్ మండలంలోని లింబాద్రి గుట్ట లక్ష్మీనృసింహస్వామి క్షేత్రాన్ని రూ.3 కోట్లతో సుందరంగా తీర్చిదిద్దారు. గిరి ప్రదక్షిణ రోడ్లు నిర్మించారు. గుట్ట పైవరకు సెంట్రల్ లైటింగ్, ఇతర సౌకర్యాలు కల్పించారు.
అభివృద్ధి పథంలో కొత్త మండలాలు
బాల్కొండ నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి. అవి బాల్కొండ, వేల్పూర్, ముప్కాల్, మోర్తాడ్, మెండోరా, ఏర్గట్ల, భీమ్‌గల్, కమ్మర్పల్లి. ఇందులో కొత్త మండలాలు ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా. ఈ కొత్త మండలాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. ఎన్నో సమస్యలు దూరమయ్యాయి. క్రమంగా కొత్త భవనాలు సమకూరుతున్నాయి. పాత మండలాలతోపాటు కొత్త మండలాల్లోనూ మండల కేంద్రాలు, సెంట్రల్ లైటింగ్, రోడ్డు డివైడర్ సౌకర్యాలు అందుకున్నాయి.
విద్య, క్రీడారంగాల అభివృద్ధి..
నియోజకవర్గంలో విద్య, క్రీడా రంగాల అభివృద్ధి జరిగింది. ఎన్నో పాఠశాలలకు ప్రత్యేకంగా అదనపు గదులు, సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేశారు. కమ్మర్‌పల్లిలో రూ.2.50కోట్లతో మినీ స్టేడియం నిర్మించి యువత దశాబ్దాల కల నెరవేర్చారు. కొత్తగా రెండు మైనార్టీ, ఒక బీసీ, ఒక సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు మంజూరై కొనసాగుతున్నాయి. మన ఊరు-మన బడి కింద పాఠశాలల్లో సౌకర్యాల కల్పన జరుగుతున్నది. భీమ్‌గల్‌లో న్యాక్ ద్వారా వందల మంది యువతకు ఉపాధి శిక్షణ అందిస్తున్నారు. వేల్పూర్ మినీ స్టేడియాన్ని అభివృద్ధి చేశారు.
ఉపాధి అవకాశాలు..
బాల్కొండ నియోజకవర్గంలో వంద మందికి దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయి. ఎందరో కూలీలు.. ఓనర్లయ్యారు. సొంత వ్యాపారాలకు నోచుకున్నారు. ట్రాక్టర్లు, టాటాఏస్‌లు, కార్లు, వరికోత యంత్రాలు, పొక్లెయినర్లు, పలు రకాల షాపులకు యజమానులయ్యారు. గ్రామగ్రామాన గొర్రెల పంపిణీతో గొల్లకుర్మలు ఉపాధిలో స్థిరపడ్డారు. ఎస్సారెస్పీ, ఇతర చిన్న ప్రాజెక్టులు, చెరువుల్లో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంతో మత్స్యకారులకు దళారుల బెడద తప్పి ఉపాధి పెరిగింది.
60వేల మందికి ‘ఆసరా’..
నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీ జరుగుతున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా 60 వేల మందికి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, బీడీ కార్మికులు, గీత కార్మికులు తదితర పింఛన్లు అందుతున్నాయి. ప్రతి నెలా వేలాది మందికి పింఛన్ భరోసా కొనసాగుతున్నది.
రూ.266 కోట్లతో పల్లెల అభివృద్ధి..
నియోజకవర్గంలో పంచాయతీరాజ్ నిధులతో భారీగా అభివృద్ధి జరిగింది. రూ.266 కోట్ల పీఆర్ నిధులతో భారీ సంఖ్యలో కుల సంఘ భవనాలు, డ్రైనేజీలు, జీపీ భవనాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టారు.
చివరి దశకు డబుల్బెడ్రూం ఇండ్లు..
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నది. కొవిడ్ సమయంలో పనుల వేగం తగ్గడంతో ఆలస్యం చోటు చేసుకున్నా.. కొవిడ్ ప్రభావం తగ్గగానే పనులు ఊపందుకున్నాయి. వేల్పూర్, బడా భీమ్‌గల్‌లో పంపిణీ పూర్తి కాగా మోర్తాడ్, బాల్కొండ, భీమ్‌గల్, మెండోరా, ఏర్గట్ల మండలాల్లో పనులు సాగుతున్నాయి. బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్‌పల్లిలో చివరిదశకు వచ్చాయి.