బాన్సువాడ/బాన్సువాడ రూరల్ 6: రెండున్నరేండ్లలో రేవంత్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటం, కేసీఆర్ను తిట్టడంతప్ప ప్రజలకు చేసిందేమీలేదని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన బాన్సువాడలో ఎన్నికల ప్రచారంలోపాల్గొనడంతోపాటు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఇప్పటివరకు ప్రజలకు ఏం చేసిందో చెప్పకుండా, తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్ను తిట్టడం తప్ప చేసిందేమీలేదన్నారు.
అభివృద్ధి చేసే చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్రెడ్డి అని విమర్శించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలూ సంతోషంగా ఉన్నాయని గుర్తుచేశారు. సీఎం రేవంత్రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు ఎదురుచేస్తున్నారని తెలిపారు. ఆయన సీఎంగా ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు ఎటుపోయాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
కారు గుర్తుకు ఓటేసి పోచారం శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే, కాంగ్రెస్లో చేరి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వం బాన్సువాడకు రూ.678 కోట్ల నిధులు మంజూరుచేసిందని తెలిపారు. ఎస్డీఎఫ్ కింద రూ.200 కోట్లు మంజూరుచేస్తే అందులో నుంచి పోచారం కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయాలని ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నాడని, భయపడవద్దని సూచించారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత పోచారం బాన్సువాడకు ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో పోచారం, ఆయన కుటుంబం గురించి మాట్లాడిన వీడియోను సమావేశంలో చూపించారు. బాన్సువాడ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు.బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేడు బాన్సువాడకు కేటీఆర్ రానున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.