Srinivasa Mangapuram | ఘట్టమనేని కుటుంబం నుంచి యువ హీరోగా పరిచయమవుతున్న జయకృష్ణ, ప్రముఖ నటి రవీనా టండన్ కూతురు రాషా తడాని జంటగా నటించిన తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘ఆర్ఎక్స్ 100’, మంగళవారం వంటి సంచలన చిత్రాల తర్వాత దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. మోహన్ బాబు, శ్యామ్, బ్రహ్మాజీ వంటి హేమాహేమీలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ
తిరుపతి నేపథ్యంతో ఈ కథ సాగుతుంది. నగరంలో అడుగుపెట్టిన యువకుడు శ్రీను (జయకృష్ణ) .. అక్కడి పవర్ ఫుల్ వ్యక్తి పెద్దిరెడ్డి (శ్యామ్) గారాల కూతురు మంగ (రాషా తడాని)ని మొదటి చూపులోనే ఇష్టపడతాడు. ఆమెకు చేరువయ్యే ప్రయత్నంలో ఉండగా, మంగ జీవితానికి సంబంధించి ఒక షాకింగ్ నిజం తెరపైకి వస్తుంది. అసలు ఆ రహస్యాన్ని పెద్దిరెడ్డి ఎందుకు దాచాడు? శ్రీను నేపథ్యం ఏమిటి? మంగతో అతనికి ఉన్న పాత సంబంధం ఏంటి? బళ్లారి ప్రాంతానికి చెందిన వెంకటప్పయ్య (మోహన్ బాబు), లక్ష్మీపతి (అజయ్)ల మధ్య జరిగిన వివాదాలు ఈ కథను ఎలాంటి మలుపులు తిప్పాయి? చివరికి శ్రీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేదే ఈ చిత్ర అసలు కథ.
విశ్లేషణ
కొత్త హీరోలను లాంచ్ చేసేటప్పుడు చాలామంది దర్శకులు ఎంచుకునే సేఫ్ రూట్… యాక్షన్ ఫార్మాలా విత్ లవ్ స్టోరీ! దర్శకుడు అజయ్ భూపతి కూడా ‘శ్రీనివాస మంగాపురం’ కోసం ఇదే రొటీన్ మాస్ కమర్షియల్ బాటపట్టారు. స్టోరీ పరంగా పెద్దగా కొత్తదనం లేకపోయినా.. విలన్ క్రూరత్వం, హీరోయిన్ వెనక హీరో పడే లవ్ ట్రాక్, మధ్య మధ్యలో వచ్చే పాటలతో ప్రథమార్థం సాగిపోతుంది. జై కృష్ణ తన డాన్సులతో అలరించగా, నరేష్, బ్రహ్మాజీల కామెడీ మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్, హీరో హీరోయిన్ల అసలు కథ, యాక్షన్ సీక్వెన్సెస్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. అయితే, క్లైమాక్స్ డ్రామా కాస్త ఎక్కువైనట్లు అనిపిస్తుంది. తన గత చిత్రాల తరహాలో కాకుండా, అజయ్ భూపతి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా పూర్తిగా ‘సేఫ్ గేమ్’ ఆడేశారు. పకడ్బందీ స్క్రీన్ ప్లే, బలమైన క్యారెక్టరైజేషన్స్‌పై మరికాస్త దృష్టి పెట్టి ఉంటే ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామా మరో స్థాయిలో ఉండేది.
నటీనటులు
జయకృష్ణ, రాషా తడాని తమ తొలి సినిమాతోనే అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ముఖ్యంగా జయకృష్ణ ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి పరిణతి చూపించాడు. డాన్సులు, యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ ఆకట్టుకున్నాడు. రాషా తడాని కూడా తన అందం, అభినయంతో తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. మోహన్ బాబు తన సీనియారిటీతో, పవర్ ఫుల్ ఇంటెన్సిటీతో పాత్రకు పూర్తి వన్యాయం చేశారు. కిక్ శ్యామ్, అజయ్ తమ విలనిజంతో సినిమాను నిలబెట్టగా.. బ్రహ్మాజీ, నరేష్‌ల కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది.
సాంకేతికంగా
దర్శకుడు అజయ్ భూపతి ఎంచుకున్న లవ్ అండ్ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ బాగుంది. ముఖ్యంగా లీడ్ జంట మధ్య వచ్చే లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్స్‌ను ఆయన చాలా సెన్సిటివ్‌గా డీల్ చేశారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచాయి. ముఖ్యంగా స్క్రీన్ పై పాటలు మరింత రిచ్‌గా కనిపిస్తాయి. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ చాలా సహజంగా, రిచ్‌గా ఉంది. తిరుపతి పరిసర ప్రాంతాలను ఆయన కెమెరాలో బంధించిన తీరు అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు
జయకృష్ణ, రాషా తడానిల జోడీ, పెర్ఫార్మెన్స్
సెకండాఫ్‌లో వచ్చే కొన్ని బలమైన భావోద్వేగాలు
జీవి ప్రకాష్ సంగీతం, కెమెరా పనితనం
మోహన్ బాబు, శ్యామ్ల నటన
బలహీనతలు
రొటీన్ అండ్ రెగ్యులర్ అనిపించే కొన్ని కథాంశాలు
ఫస్టాఫ్‌లో అక్కడక్కడా నెమ్మదించిన కథనం
కొన్ని అనవసరమైన పాటలు ఫ్లోను అడ్డుకున్నట్లు అనిపిస్తాయి
మొత్తంగా చెప్పాలంటే, ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా సరికొత్త ప్రయోగం కాకపోయినా.. చక్కటి ఎమోషన్స్, మంచి లవ్ ట్రాక్‌తో కూడిన ఒక డీసెంట్ యాక్షన్ డ్రామాగా నిలుస్తుంది. నూతన నటీనటుల ప్రతిభ, దర్శకుడి టేకింగ్ ఈ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తాయి. రొటీన్ అంశాలను పక్కన పెడితే వీకెండ్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది.
రేటింగ్ : 3