బాన్సువాడ, ఫిబ్రవరి 9: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలుచేయకుండా మోసం చేసిన కాం గ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. అభివృద్ధిని కాంక్షించే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సోమవారం ఆయన బాన్సువాడ పట్టణంలోని 5, 8,9,11, 13,18వ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
పాత బాన్సువాడలో బాజిరెడ్డి మాట్లాడుతూ.. బాన్సువాడ ప్రజలు మంచివారని, కానీ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పే మాటలు విని మోసపోతున్నారని అన్నారు. పోచారం ఆరచేతిలో ప్రపంచం చూపిస్తారని ఎద్దేవా చేశారు. రూ. కోట్లు సంపాదించుకోవడానికి పార్టీ మారాడని మండిపడ్డారు. ప్రజల మీద ప్రేమ ఉంటే బాన్సువాడకు నిధులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు పాత బాన్సువాడకు చెందిన ఓటర్లు తమ వైపు ఉన్నారని చెబుతున్నారని అన్నారు.
పాత బాన్సువాడలో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు, బస్తీ దవాఖాన, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించిందని తెలిపారు. ఇన్ని అభివృద్ధి పనులు చేసిన బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రెండున్నరేండ్లలో పాత బాన్సువాడకు ఎన్ని నిధులు ఇచ్చారని నిలదీశారు. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. తాను ప్రజలకు అండగా ఉండాలని, బాన్సువాడలో మంచి పేరు ఉందని, తనను పంపించారని, తాను కేసీఆర్ సైనికుడిలా ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.