బాన్సువాడ, జూన్ 20: పాలన చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి అని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాప్‌ను రద్దు చేసే వరకు రైతుల పక్షానా పోరాడుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతులకు అవసరాలకు అనుగుణంగా యూరియా అందించారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా యాప్‌తో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. శనివారం ఆయన బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు ఇన్చార్జి ఆగన్న, స్థానిక నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా తదితర సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేపట్టి తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారని, చివరికి రూ. 10వేలు కూడా ఇవ్వని దౌర్భాగ్యస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కౌలు రైతులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని రేవంత్‌రెడ్డి చెప్పాడని, బాన్సువాడ, బోధన్ నియోజక వర్గాల్లో 70 శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, ఇప్పుడు వారికి ఎందుకు రైతుబంధు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రం చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయలేని చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారని తెలిపారు. పాలన చేతకాకపోతే రేవంత్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ సలహాదారుడిగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు రైతుల కష్టాలను చూస్తున్న ఆయన, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవసాయశాఖకు ఏం సూచనలు చేస్తున్నారో చెప్పాలని బాజిరెడ్డి డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను చెప్పని పోచారం శ్రీనివాసరెడ్డి.. వ్యవసాయ సలహాదారుడిగా, అనుభవంఉన్న నాయకుడిగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. కేవలం ఆయన పొట్టగడవడం కోసమేనా అని ఎద్దేవా చేశారు. బాన్సువాడ ప్రాంతంలో ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారని, వారికి రైతుబంధు రాలేదని ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
షాపులో లేని యూరియా యాప్‌లో ఎలా దొరుకుతుందని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి తోట ఆగన్న అన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యూరియా కోసం లైన్ కడితే దొరకని యూరియా ఇప్పుడు యాప్‌తో ఎలా దొరుకుతుందో చెప్పాలని ప్రశ్నించారు. అడ్డదారిలో సీఎం అయిన రేవంత్‌రెడ్డి మోసగాడని, పోచారం శ్రీనివాసరెడ్డి మోసగాళ్లకు మోసగాడని విమర్శించారు. అనంతరం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్, రైతుబంధు సమితి జిల్లా మాజీ కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్లు మక్బూల్ , ఫిరోజ్, ఖలీల్, పాల్గొన్నారు

రామారెడ్డి, జూన్ 20: యూరియా కోసం యాప్‌లో బుక్‌చేసుకోగా, అయిపోయినట్లు సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన రైతులు రైతువేదికలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అధికారుల సూచనల మేరకు రైతులు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రామారెడ్డి రైతువేదిక వద్దకు వచ్చారు.రామారెడ్డి, పోసానిపేట్ క్లస్టర్ల పరిధిలో మొత్తం 1,332 బస్తాల యూరియాను ఆన్లైన్లో ఉంచారు. రైతులు బుక్ చేసుకునేలోపు క్షణాల్లో యూరియా ఖాళీ అయినట్లు చూపించింది. దీనిపై అధికారులను అడుగగా, వారు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో ఆగ్రహించిన రైతులు రైతువేదికలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఇన్చార్జి అదనపు కలెక్టర్ గిరి, వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. తమ వద్ద స్మార్ట్ ఫోన్లు లేవని, యాప్‌ను రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని రైతులు కోరారు.తహసీల్దార్ ఉమాలత, ఎస్సై రాజశేఖర్, ఏడీఏ సుధారాణి రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
కామారెడ్డి, జూన్ 20: యూరియా పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు దోమకొండ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. యూరియా యాప్‌తో చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యాప్ ద్వారా యూరియాను కొనుగోలు చేసుకోలేక పోతున్నారని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత విధానంలోనే యూరియాను పంపిణీ చేయాలని కోరారు. అనంతరం ర్యాలీగా తహసీల్ ఆఫీస్ వరకు తరలివెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజాంసాగర్, జూన్ 20: స్మార్ట్ ఫోన్లు ఉన్న రైతులకే యూరియా అందుతున్నదని, తమ వద్ద సాధారణ ఫోన్లు మాత్రమే ఉన్నాయని వడ్డేపల్లి గ్రామ రైతులు వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించారు. మండలలోని వడ్డేపల్లి గ్రామ రైతు వేదికలో శనివారం యూరియా యాప్ వినియోగంపై మండల వ్యవసాయశాఖ అధికారిణి ఆచరిత, ఏఈవో సాగర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామాల్లో చాలా మంది రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేవని, చిన్న ఫోన్లు మాత్రమే ఉన్నాయని, అలాంటప్పుడు యాప్‌లో బుకింగ్ ఎలా చేసుకోవాలి, తమకు యూరియా ఎలా అందిస్తారో చెప్పాలంటూ అధికారులను నిలదీశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి యూరియా అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సర్పంచ్ అంజయ్య, రైతులు పాల్గొన్నారు.

మండలంలోని పచ్చలనడ్కుడ సొసైటీ పరిధిలో ఉన్న జాన్కంపేట్ గ్రామంలో యూరియా కోసం శనివారం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యూరియా కోసం వరుసలో ఆధార్ కార్డులను ఉంచారు.
-వేల్పూర్, జూన్ 20