నిజామాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు గెలుపోటములు సర్వసాధారణమని కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని సూచించారు. గడిచిన రెండు నెలలుగా తన గెలుపు కోసం రాత్రింబవళ్లు కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలందరికీ ధన్యవాదాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతిఒక్కరూ తమ స్థాయిలో కష్టపడ్డారని గుర్తుచేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెప్పిన అబద్ధాలు, అసత్యాలు పని చేశాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిజాయతీగా ప్రజల ముందుకు వచ్చిందన్నారు. రెండు జాతీయ పార్టీలు చెప్పిన మాటలను ప్రజలు నమ్మాల్సి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ దురదృష్టం కొద్దీ ఓడిపోయిందన్నారు. ఈ ఓటమితో ఎవ్వరూ కుంగిపోవద్దని బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. మరో ఎన్నికల్లో సత్తా చాటేందుకు గులాబీ సైన్యం సంసిద్ధులై ఉండాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తనకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బాజిరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. ఇందుకు సార్వత్రిక ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఉత్తర భారతదేశంలో బీజేపీ చేష్టలను, వారి పనితీరును గుర్తించి తన్ని తరిమి వేశారన్నారు. ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ట్రంలో బీజేపీకి ఆశాభంగం అయ్యిందన్నారు. ఉత్తర భారతీయులందరికీ మోదీపై భ్రమలు తొలిగిపోయాయని అందుకు ఈ ఎన్నికలే రుజువు చేశాయని చెప్పారు. అతి త్వరలోనే దక్షిణ భారతదేశంలోనూ మోదీపై భ్రమలు తొలిగిపోయే పరిస్థితులు వస్తాయన్నారు. కాస్త సమయమైతే బీజేపీ నిజస్వరూపం దక్షిణాదిలోనూ తేటతెల్లం అవుతుందన్నారు. బీఆర్ఎస్ వల్లే బీజేపీ గెలిచిందంటూ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిపై బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్సీ కవితను ఓడించేందుకు బీజేపీకి సహకరించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. లౌకిక పార్టీ అని చెప్పుకుంటూ ఫక్తూ మతతత్వ పార్టీకి మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా గతం మాదిరిగానే ఈసారి కూడా బీజేపీకి ఓటేసి గెలిపించారని ఎద్దేవా చేశారు. ఇందులో బీఆర్ఎస్ తప్పిదం లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లే ఆత్మహత్యాసదృశ్యం అన్నట్లుగా ఈ ఎన్నికలను మార్చుకున్నారని మండిపడ్డారు. కుమ్మక్కు రాజకీయాలతో నిజామాబాద్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయన్నారు.
-గాలి అనిల్‌కుమార్
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. బీఆర్ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశాను. ప్రజలతో మమేకం అయ్యాను. నా గెలుపుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. నా కోసం ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.