ధర్పల్లి, అక్టోబర్ 10 : బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభు త్వం డ్రామా ఆడుతున్నదని, స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడానికే తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెర తీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి, బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..స్థానిక ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని పేర్కొన్నారు.
శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన సీఎం రేవంత్రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేశారు తప్ప, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడంపై ఏనాడు చిత్తశుద్ధి ప్రదర్శించలేదని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్టబద్ధత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్రెడ్డి ప్రభుత్వం.. తెలివిగా దాన్ని పక్కదోవ పట్టించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అనేక హామీలను పక్కనబెట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పేరిట పూటకో డ్రామా ఆడుతూ బీసీలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీసీలపై నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు. రేవంత్రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని, కాంగ్రెస్ పార్టీకి బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్ల పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడాలని సూచించారు. పార్లమెంట్లో చట్టం చేయించాలని బాజిరెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పోరాటంలో ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకోసం ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని బాజిరెడ్డి పిలుపునిచ్చారు