నిజామాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ప్రజా పాలన నడవడం లేదని, కాంగ్రెస్, బీజేపీ కలయికతో కూడిన కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఢిల్లీలో కుస్తీ పట్టినట్లుగా నటిస్తున్న ఈ రెండు జాతీయ పార్టీలు.. గల్లీలో మాత్రం ఫ్రెండ్షిప్ చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొంగ నాటకాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పా రు. గురువారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదు ప్రక్రియకు సంబంధించి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి బాజిరెడ్డి మాట్లాడారు. సభ్యత్వ నమోదు విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలను శ్రేణులకు వివరించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రజలు బూతులు తిడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంపై అడుగడుగునా నిలదీస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు ఎదురవుతున్నాయని, ఈ కష్ట కాలంలో జనాలకు తోడుగా ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త నిలవాలన్నారు. నియోజకవర్గంలో అధికార పోకడలకు వ్యతిరేకంగా గట్టిగా జవాబు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పోలీస్ కేసులు, జైళ్లకు భయపడొద్దని హితవు పలికారు. కార్యకర్తలకు అండగా పార్టీతో పాటు తానూ ఉంటానని భరోసానిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఎవరికి వారు దోచుకు తింటున్నారని బాజిరెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిసి లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల బాధలు వీరికి పట్టడం లేదని, ధాన్యం అమ్ముకోలేక రైతులు ఏడుస్తుంటే స్పందించడం లేదన్నారు. రైతులు ఫోన్ చేసి తమ బాధను చెబుతుంటే కళ్లలోంచి నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో గంటల వ్యవధిలోనే ధాన్యం కొనుగోళ్లు జరిగాయని, అప్పట్లో పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టామన్నారు. కానీ ఇప్పుడు రైతులను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్నారు. ధాన్యం అమ్ముకునేందుకు నెల రోజుల పాటు నిరీక్షించడమంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా? అని ప్రశ్నించారు. క్వింటా ధాన్యానికి రైస్ మిల్లర్లు 3 కిలోలు చొప్పున తరుగు తీస్తున్నారని చెప్పారు. మక్కలు, జొన్నలను కొనే వారే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మెంబర్‌షిప్‌ను సీరియస్‌గా తీసుకుని ప్రజల్లో తిరగాలని బాజిరెడ్డి సూచించారు. సీనియర్ లీడర్లమని చెప్పుకుని ఇంటికే పరిమితం కావద్దని హెచ్చరించారు. కష్టపడి పని చేయాలని, పార్టీ అండగా ఉంటుందని చెప్పారు
తెలంగాణ అంతటా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం విస్తృతంగా వినిపిస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇన్చార్జి వీజీ గౌడ్ అన్నారు. ప్రజా వ్యతిరేకతను అతి తొందరగా మూటగట్టుకున్న రికార్డును కాంగ్రెస్ సర్కారు సొంతం చేసుకుందన్నారు. పూటకో మాట మాట్లాడటం, బూతులు వల్లించడం తప్ప సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతకావడం లేదన్నారు. వచ్చేది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలంతా గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశానుసారం కష్టపడి పని చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదు డ్రైవ్‌ను పకడ్బందీగా చేపట్టాలన్నారు. కేసీఆర్ ఆదేశాలతో డిజిటల్ రూపంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టబోతున్నామని వీజీ గౌడ్ చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 273 బూత్‌లు ఉన్నాయని, వీటికి ఇద్దరు చొప్పున ఇన్చార్జీలను నియమిస్తామన్నారు. ఈసారి మెంబర్షిప్ కోసం బుక్కులు ఉండవని, మొబైల్లోనే సభ్యత్వదారుడి ఫొటో, వివరాలు నమోదు చేస్తారని చెప్పారు. మండల సమన్వయ కమిటీ, నియోజకవర్గ సమన్వయ కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. మండలానికి ఐదుగురు, నియోజకవర్గానికి ఐదుగుర చొప్పున కమిటీలో చోటు కల్పిస్తామని, వీరికి శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ సర్కారులో ప్రజలంతా తీవ్రంగా మోసపోయి గోస పడుతున్నారని తెలిపారు.
నిజామాబాద్ రూరల్‌లో కాం గ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నియంతృత్వం, ఫ్యాక్షనిజం నడుస్తున్నదని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ నాయకులే నడిరోడ్డుపై కత్తులతో నరుక్కునే ఘటనలు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. పోలీసు వ్యవస్థ పని చేయడం లేదని, ప్రజలకు రక్షణ కరువైందన్నారు. రైతులైతే యూరియా యాప్ దగ్గరి నుంచి వడ్లు అమ్ముకునే వరకు తంటాలు పడుతున్నారని మండిపడ్డారు. వడ్ల కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడీ విచ్చలవిడిగా పెరిగి పోయిందన్నారు. రూరల్ నియోజకవర్గంలో ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని, బీఆర్ఎస్ నేతలపై కేసులు బనాయిస్తున్నారనిచెప్పారు. ఎమ్మెల్యేను కలవడానికి క్యాంప్ ఆఫీస్‌కు పోతే ప్రజలను దూరం పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలే ఇప్పుడున్న ఎమ్మెల్యే పట్ల అసంతృప్తితో రగిలి పోతున్నారని చెప్పారు. ఇక్కడికి ఎందుకు వచ్చారని ఉల్టా అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో పదేండ్ల పాటు కేసీఆర్ పాలన అద్భుతంగా కొనసాగిందని జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రజా పాలన పేరుతో నయవంచన జరుగుతున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఆదాయ వృద్ధి, సంపద సృష్టి జరిగిందని, ఇప్పుడు సంపదను కొల్లగొట్టే పనులే జరుగుతున్నాయన్నారు. తాను జడ్పీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ ప్రాంగణంలో మడిగలు నిర్మించి నెలకు రూ.3లక్షల ఆదాయాన్ని సమకూర్చినట్లుగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాంబారి మోహన్, సుమనారెడ్డి, హన్మంత్‌రెడ్డి, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ డ్రామాలు చేస్తున్నారని బాజిరెడ్డి ధ్వజమెత్తారు. పసుపుబోర్డు బోర్డుకే పరిమితమైందని, రోజూ తాళాలతోనే దర్శనం ఇస్తున్నదని మండిపడ్డారు. తాత్కాలిక ఏర్పాట్లతో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు లాభం లేదన్నారు. ఏడాదిన్నర దాటినప్పటికీ పసుపుబోర్డుతో రైతులకు ఒనగూరిన లాభాలు ఏమిటో బీజేపీ ఎంపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డ్రామాలను రైతులంతా గమనించాలని సూచించారు. దేశ వ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతున్నదన్నారు. ఎన్నికలు ఉండే రాష్ర్టాల్లోనే ఈ ప్రక్రియను తీసుకొచ్చి బీజేపీ కుటిల రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. జూన్ 25 నుంచి రాష్ట్రంలో ‘సర్’ మొదలు కాబోతున్నదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని బాజిరెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.