సారంగాపూర్, ఆగస్టు 15: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని మన సత్తాను చాటాలని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్‌రావు శుక్రవారం జిల్లా కేంద్రంలో బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. పార్టీ కోసం శ్రమించి విజయం సాధించే అభ్యర్థులనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపిక చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. అబద్ధాల హామీలు కురిపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 20 నెలల కాలంలో అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకతను మూట గట్టుకుని కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకొంటుందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు.
ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పేలా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. ప్రజలను చైతన్యపర్చడంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగాలన్నారు. బాజిరెడ్డితో పాటు ధర్పల్లి మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, బీఆర్ఎస్ నాయకులు రమకాంత్ ఉన్నారు.