ఇందల్వాయి/ రుద్రూర్/ బాల్కొండ/ కమ్మర్పల్లి, డిసెంబర్ 25 : జిల్లాలోని పలు గ్రామాలకు అయోధ్య రాముని పూజిత అక్షింతలు చేరాయి. ఈ సందర్భంగా వాటికి పూజలు చేసి, గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఇందల్వాయి, డిచ్పల్లికి అక్షింతలు చేరుకున్నాయి. డిచ్పల్లి మండలంలోని హనుమాన్ ఆలయం నుంచి కాశీ విశ్వేశ్వర ఆలయం వరకు అక్షింతలను భక్తులు ఊరేగించారు. తలంబ్రాలను వివిధ గ్రామాలకు పంపించినట్లు బజరంగ్దళ్ సభ్యులు తెలిపారు.
బాల్కొండ మండల కేంద్రంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతలతో శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక హనుమాన్ ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగింది. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి పూజలు చేశారు.
జిల్లాకేంద్రంలో శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతల కలశానికి సోమవారం శోభాయాత్ర నిర్వహించారు. నగరంలోని ఆర్యనగర్, వినాయక్‌నగర్, ఫూలాంగ్ చౌరస్తా, హైదరాబాద్ రోడ్, ఆర్పీ రోడ్ మీదుగా దేవీమాత ఆలయం వరకు కొనసాగింది. దేవీమాత ఆలయంలో అక్షింతలకు పూజలు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రతినిధి లక్ష్మీ నారాయణ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.కమ్మర్పల్లి మండల కేంద్రంలో అక్షింతలకు వీడీసీ సభ్యులు, మహిళలు డప్పులు, మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు.
రుద్రూర్ మండల కేంద్రంలోని విఠలేశ్వరాలయంలో గ్రామస్తులు సోమవారం సమావేశమయ్యారు. శ్రీరామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 29వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సురేశ్ ఆత్మారాం మహరాజ్ పాల్గొనన్నట్లు తెలిపారు. భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.