కామారెడ్డి : జిల్లా ప్రజలకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ( SP Sindhu Sharma) పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి ఫైనల్ చేయాలని ఆదేశించారు. పోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి పనిచేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని స్థాయిల అధికారులు మరింత దృష్టి సారించాలని అన్నారు. నేరాల నివారణ , నేర ఛేదనే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్( Investigation) , స్టేషన్ మేనేజ్మెంట్ ( Management) తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని తెలిపారు.
కొత్త కేసులతో పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ వాటిని పరిష్కరిస్తూ కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. కమ్మునిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సీసీటీవి ల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని కోరారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. విధుల్లో ప్రతిభను కనబరిచిన పోలీసు అధికారులు , సిబ్బందికి ఎస్పీ ప్రశoష పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి , అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నరసింహారెడ్డి , డీఎస్పీలు సత్యనారాయణ, శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మురళి, సీఐలు, ఆర్ఐలు ఎస్సైలు , కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.