నిజామాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) మంచి సంబంధం అనే భ్రమలో అమ్మాయిల జీవితాలను తల్లిదండ్రులు మూడు ముళ్లతో ఫుల్స్టాప్ పెట్టేస్తున్నారు. కంప్యూటర్ యుగంలోనూ సాంఘిక దురాచారం ఆందోళనకు గురిచేస్తున్నది. వయస్సుతో సంబంధం లేకుండా వివాహాలు జరుగుతున్నాయి. కొన్ని మాత్రమే అధికార యంత్రాంగానికి సమాచారం చేరడంతో నిలిపివేస్తున్నారు. ఈ దురాచారం రూపుమాపాలంటే తల్లిదండ్రుల్లోనే మార్పు రావాలని ఆయా వర్గాల నిపుణులు చెబుతున్నారు.
పెళ్లంటే నూరేళ్ల పంట. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు మంచి సంబంధం చూసి మూడు ముళ్లు వేయించి తమ బాధ్యతను తీర్చుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలో పెండ్లీడు రాకున్నా తొందరపడి వివాహం చేస్తున్నారు. ఎక్కువగా అమ్మాయిల విషయంలోనే ఇది కనిపిస్తున్నది. పెద్దల అనాలోచిత నిర్ణయాలు పిల్లలకు శాపంగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా అధికారులకు సమాచారం వచ్చి నిలిపేస్తున్న ఘటనలే పదుల సంఖ్యలో ఉంటున్నాయి. తాజాగా 15 రోజుల వ్యవధిలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నాలుగు బాల్య వివాహాలను అడ్డుకోవడం గమనార్హం. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పెండ్లిళ్లు అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. పెండ్లి చేయడం ఒక్కటే.. తల్లిదండ్రుల బాధ్యత కాదు. వారి భవిష్యత్తు ఆరోగ్యంగా, సవ్యంగాను సాగేలా చూసే అవసరమూ ఉంది. సరైన వయస్సులోనే వివాహానికి సన్నాహాలు చేయాలి. బాల్య వివాహాలతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి.
బాల్య వివాహ నిషేధ చట్టం – 2007, జనవరి 10న ఆమోదం పొంది, నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. మైనర్లకు వివాహాలను ప్రోత్సహించేవారికి, జరిపించేవారికి రెండేండ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు, ఇరుగూ పొరుగు, మద్దతు పలికిన నాయకులు, కుదిర్చిన వ్యక్తులు, వీడియోగ్రాఫర్లు, వంటవారు, ఆహార పదార్థాలు సరఫరా చేసే వారు ఇలా ఈ తంతులో పాల్గొన్న ప్రతి ఇక్కరూ శిక్షార్హులే. చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలో జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్డీవో, ప్రాజెక్టు స్థాయిలో 3 నుంచి 5 మండలాలకు కలిపి బాలల అభివృద్ధి ప్రాజెక్టు అధికారి, మండల స్థాయిలో తహసీల్దార్ పని చేస్తారు. గ్రామాల్లో అధ్యక్షుడిగా సర్పంచ్, సభ్యులుగా పంచాయతీ కార్యదర్శి, స్థానిక ఉపాధ్యాయురాలు, మహిళా వార్డు సభ్యులు, స్వచ్ఛంద సంస్థ, యువ సమాఖ్య సభ్యులు, ఆరోగ్య, అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు.
ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే మనకెందుకులే అని ఊరుకోవద్దు. బాధ్యతగా భావించి అధికారులకు సమాచారం అందించడం మంచిది. టోల్ ఫ్రీ నంబర్లు 1098, డయల్ 100కు ఫోన్ చేసి చెప్తే మిగతావన్నీ సంబంధిత సిబ్బందే చూసుకుంటారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుకు ముందు బాల్య వివాహాలు వందల్లో వెలుగు చూసేవి. తొందరగా తమ బాధ్యతను పూర్తిచేసుకునే క్రమంలో చాలా మంది తొందర పాటు నిర్ణయాలు తీసుకునేవారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షా 116 నగదు ప్రోత్సాహాన్ని అందిస్తుండడంతో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. 18 ఏండ్లు నిండితేనే ఈ పథకానికి అర్హులుగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ పథకం ద్వారా వివాహ ఖర్చులో సగం భారమైనా తప్పుతుందనే ఆశతో చాలా మంది బాల్యవివాహాలను నిర్వహించడంలేదు. కొంత మంది ఈ దురాచారాన్ని పాటిస్తుండడం దురదృష్టం. 2019లో నిజామాబాద్ జిల్లాలో 15, 2020లో రెండు, 2021లో 14 కేసులు వెలుగు చూసినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఖలీల్వాడి (మోపాల్) ఫిబ్రవరి 22: మోపాల్ మండలంలోని ఓ గ్రామంలో బుధవారం ఓ బాల్యవివాహం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఐసీడీఎస్ అధికారులు వెంటనే వెళ్లి అడ్డుకున్నారు. వధువు తల్లిందండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించామని అంగన్వాడీ సూపర్వైజర్ విశాల తెలిపారు.
బాల్య వివాహాలు చట్ట వ్యతిరేకం. ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడడం సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ఇలాంటివి చాలావరకు తగ్గాయి. అక్కడక్కడా కొద్ది మంది ఈ దురాచారంలో ఇంకా కొట్టుమిట్టాడుతుండడం బాధాకరం. అమ్మాయిలకు 18 ఏండ్లు నిండకముందే పెండ్లి చేయడం నేరం. అలాంటి వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే చర్యలు తీసుకుంటాం.
– చైతన్య, నిజామాబాద్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి