Chain Snatchings | వినాయక నగర్, మే 7: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైన్ స్నాచర్లు గురువారం తెల్లవారుజాము నుండి రెక్కి నిర్వహించారు. ముఖాలకు ముసుగులు ధరించి, తలపై టోపీలు పెట్టుకుని, నగరంలోని వివిధ కాలనీలలో తిరుగుతూ తమ టార్గెట్ కోసం అన్వేషించారు. గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కాలనీలో రోడ్డు పై ఓ మహిళ తన పెంపుడు కుక్కతో వాకింగ్ కు బయలుదేరింది. అదే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు వద్దకు వెళ్లి వచ్చిరాని తెలుగు భాషలో ఏదో అడ్రస్ చెప్పాలంటూ అడిగారు. ఆమె అడ్రస్ చెప్పేందుకు ప్రయత్నించిన సమయంలోనే పైకి వెనకాల కూర్చున్న దుండగుడు ఆమె మెడలోంచి బంగారు చైన్ తెంచేందుకు యత్నించాడు.
ఇంతలో ఆమె వెంట ఉన్న శునకం (పెంపుడు కుక్క) వెంటనే దుండగులపైకి దాడి చేసేందుకు ఎగిరింది. దీంతో దుండగులు అక్కడనుండి పరారయ్యారు. అనంతరం మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బా ప్రాంతంలో మరో మహిళ వాకింగ్ చేస్తుండగా ఆమె వద్దకు వెళ్లి మెడలోంచి బంగారు గొలుసు తెంచేందుకు యత్నించడంతో ఆమె గట్టిగా అరవడంతో దుండగులు అక్కడ నుండి పారారైపోయారు. అటువైపు నుండి నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల శ్రీనగర్ కాలనీ వైపు బైక్ పై వచ్చిన దుండగులు తన ఇంటి ముందు మొక్కలకు నీళ్లు పోస్తున్న మహిళను చూసి ఆమెను టార్గెట్ చేశారు. రేగూరి పద్మావతి అనే సదరు మహిళ వద్దకు వెళ్లినా దుండగులు ఇద్దరు హిందీ భాషలో మాట్లాడుతూ ప్రాంతంలో శివాలయం ఎక్కడుందని అడిగేందుకు ప్రయత్నించారు. ఆమె వారిని గమనిస్తున్నంతలోపే ఇద్దరు దుండగులు ఆమెపై పడి మెడలోని మూడు తులాల బంగారు గొలుసు తెంచారు.
అప్పటికే వారిని పసిగట్టిన ఆమె తన మెడలోని బంగారు గొలుసును గట్టిగా పట్టుకోవడంతో సగం గొలుసు మాత్రమే దుండగుల చేతుకు చిక్కడంతో వారు అక్కడి నుండి పరారైపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంబంధిత పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చైన్ స్నాచింగ్ ఘటన విషయం తెలియడంతో సీపీ సాయి చైతన్య సీరియస్ గా పరిగణించినట్లు సమాచారం. నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బృందాలు చైన్స్ స్నాచర్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో సతీష్ ఆధ్వర్యంలో ఎస్సైలు సందీప్, ఉదయ్ కుమార్ ఇతర సిబ్బంది తమ ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం చైన్స్ స్నాచింగ్ యత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకోవడంతో నగర సీఏ శ్రీనివాసరాజ్ ఆధ్వర్యంలో మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు, సీసీ కెమెరాల ఫుటేజీల పరిశీలనలో నిమగ్నమయ్యారు.