దేశంలోనే అత్యంత భారీగా తెరకెక్కుతున్న చిత్రం.. పాన్ ఇండియా పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. రణబీర్‌కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, కన్నడ అగ్ర నటుడు యశ్ రావణుడిగా, కాజల్ మండోదరిగా, సన్నీడియోల్ హనుమంతుడిగా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నితేశ్ తివారీ దర్శకుడు. నమిత్ మల్హోత్రా రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ ఫ్రాంచైజీలోని తొలి భాగం ఈ ఏడాది దీపావళికి విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా గ్లోబల్ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అమెరికాలో జరుగుతున్న ‘శాన్ డియాగో కామిక్-కాన్ 2026’ వేడుకల్లో ఈ సినిమా బృందం సందడి చేసింది. ఇందులో భాగంగా ఇందులో రాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్‌పై రావణపాత్రధారి యశ్ ప్రశంసలు కురిపించారు.
‘రాముడి పాత్ర పోషించడం చాలా కష్టం. భావోద్వేగాలతో కూడుకున్న పాత్ర అది. రణబీర్ ఆ పాత్రను చాలా గొప్పగా పోషించాడు. ఈ సినిమా చూసినప్పుడు అతని నిబద్ధత కనిపిస్తుంది. సంకల్పబలం ఉంటే తప్ప ఇలాంటి సినిమాలను నిర్మించలేం. ఈ సినిమా ప్రయాణంలో జీవితానికి కావాల్సిన ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. సాంకేతికంగా ఈ సినిమా ఓ సవాల్. మంచి టీమ్ కుదరడంతో అన్నీ కలిసొచ్చాయి. మా శక్తివంచన లేకుండా కృషి చేశాం’ అని తెలిపారు యశ్. ఇదిలావుంటే ఈ నెల 24న విడుదల కావాల్సిన ఈ సినిమా ట్రైలర్ వాయిదా పడింది. ట్రైలర్‌ని కూడా అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని సంకల్పించామని, అందుకే వాయిదా వేశామని, త్వరలోనే ట్రైలర్‌ని విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.