అగ్ర హీరో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. సతీమణి రష్మిక మందన్నతో కలిసి ఆయన నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వివాహానంతరం రాబోతున్న తొలి సినిమా అదే కావడం మరింత హైప్‌ని క్రియేట్ చేస్తున్నది. ఈ పీరియాడిక్ డ్రామా కోసం విజయ్ దేవరకొండ గుర్రపుస్వారీ, యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రత్యేకంగా నిలుస్తుందని చెబుతున్నారు. గుర్రపుస్వారీ, కత్తిసాముతో పాటు గన్ షూటింగ్లో (ఫైర్ఆర్మ్ ఆపరేషన్) ఇంటెన్స్ ట్రెయినింగ్ తీసుకున్నాడట.
గుర్రపుస్వారీ చేస్తూనే బందూక్ను పేల్చే యాక్షన్ ఘట్టాలపై ఆయన ప్రత్యేక తర్ఫీదును తీసుకున్నాడని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పోరాట ఘట్టాలు అత్యంత సహజంగా కనిపించేందుకు శారీరకంగా కఠోర సాధన చేశారని, హెవీ బాడీబిల్డింగ్‌తో ఆయన లుక్స్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయని చెబుతున్నారు. రణబాలి పాత్ర తాలూకు శారీరక, మానసిక ఉద్వేగాల్ని ప్రతిబింబించేలా యుద్ధ వీరుడిగా ఆయన పాత్ర ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుందని అంటున్నారు. 1854-1878 మధ్య బ్రిటీష్ కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్-అతుల్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్, కథ, దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్.