వర్ని, మే 31: దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిని చితకబాదడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఈ ఘటన వర్ని మండలం తగిలేపల్లిలో శుక్రవారం చోటుసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. తగిలేపల్లి గ్రామానికి చెందిన మైదం నారాయణ (41) చిల్లర దొంగతనాలు చేస్తుండేవాడు. అదే గ్రామానికి చెందిన చాకలి మల్లెల భూమయ్య ఇంటికి శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దొంగతనానికి వెళ్లాడు. గమనించిన భూమయ్య కుటుంబ సభ్యులు.. నారాయణను బంధించి తీవ్రంగా చితకబాది వదిలేశారు. విషయం తెలుసుకున్న నారాయణ కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లిన కొద్ది సేపటికే నారాయణ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూరు సీఐ జయేశ్రెడ్డి, వర్ని ఎస్సై కృష్ణ కుమార్ పరిశీలించి నారాయణపై దాడిచేసినవారిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.