కాంగ్రెస్ ఆగడాలు రోజురోజుకూ శ్రుతి మించుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులపై హస్తం నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. మొన్ననే కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఒకరు.. అధికార పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ర్యాలీలోకి చొరబడి దౌర్జన్యానికి దిగారు.
బోధన్, నవంబర్ 20 : బోధన్ మండలం పెంటాకుర్దు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలు రోజూ మాదిరిగానే సోమవారం ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి ర్యాలీ గ్రామంలోకి ప్రవేశించింది. రెండు ర్యాలీలూ ఎదురుపడగా, సుదర్శన్‌రెడ్డి గ్రామంలోకి ఎందుకు ర్యాలీ నిర్వహిస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఒక నాయకుడు దూసుకువచ్చి ప్రచార వాహనాన్ని తన్ని కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగాడని బీఆర్ఎస్ నాయకుడు శివసాయి పటేల్ తెలిపారు.
ఘటన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.. తనతోపాటు తమ కార్యకర్తలను నెట్టేస్తూ దాడికి దిగారని చెప్పారు. అహంకారంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ దౌర్జన్యాన్ని గ్రామస్తులు ఖండించారు. ఈ ఘటనపై ఎన్నికల మొబైల్ స్కాడ్ సీసీ ఫుటేజీలను పరిశీలించి, తమకు ఇచ్చే నివేదిక ఆధారంగా కేసులు నమోదుచేస్తామని బోధన్ రూరల్ ఎస్సై నాగనాథ్ తెలిపారు.