పెద్ద కొడప్గల్, జనవరి 12: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి ఏటీఎంలోకి చొరబడిన దుండగులు గ్యాస్‌కట్టర్‌తో మిషన్ ధ్వంసం చేసి రూ.17.79 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా పెద్దకొడప్గల్, బిచ్కుందకు వెళ్లే మార్గంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి శనివారం అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో దుండగులు చొరబడ్డారు.
ముసుగుతో వచ్చిన దుండగులు సీసీ కెమెరాలపై స్ర్పై చేసి ముఖాలు కనబడకుండా చేశారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి రూ.17.79 లక్షలను ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని అదనపు అడిషనల్ ఎస్పీ చైతన్యా రెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాజేశ్వర్ ఆదివారం పరిశీలించారు. పిట్లం మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఏటీఎం సూపర్వైజర్ రాచర్ల ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.