కమ్మర్పల్లి/ముప్కాల్/ మెండోరా, జూలై 16 : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిండాలంటే ఎగువన ఉన్న మహారాష్ట్రలో, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాల్సిందే. ఈ ఏడాది వానకాలం ప్రారంభమైనా వర్షాలు కురవకపోవడంతో రైతన్న ఆందోళన చెందుతున్న వేళ.. కాళేశ్వరం నీటిని ముప్కాల్ పంప్‌హౌస్ నుంచి భారీ మోటర్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను నింపి బాల్కొండ నియోజకవర్గ రైతుల్లో భరోసా కల్పిస్తున్నారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. వరద కాలువతో కాళేశ్వర జలాలను రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకువచ్చి రైతుల పక్షాన నిలిచారు.
ముప్కాల్ పంప్హౌస్నుసందర్శిచేందుకు క్యూ కడుతున్న రైతులు..
ముప్కాల్ పంప్ హౌస్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించేందుకు రైతులు తరలివస్తున్నారు. ఆదివారం భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్, పల్లికొండ, పిప్రి, బాచన్పల్లి గ్రామాల రైతులు ఐదు బస్సులు, కార్లలో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముప్కాల్ పంప్‌హౌస్‌ను ఆసక్తిగా తిలకించారు. భారీ మోటర్ల ద్వారా రివర్స్ పంపింగ్ ప్రక్రియను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాళేశ్వర జలాలను ఎస్సారెస్పీకి తరలించి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశారని సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కొనియాడారు. ముప్కాల్ పంప్‌హౌస్ భారీ పైపుల నుంచి విడుదలవుతున్న నీటిని చూసి సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వర జలాలు పారుతున్న ప్రాంతంలో రైతులు గ్రూప్ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. మహిళా రైతులు కాళేశ్వరం జలాలను మొక్కి, నెత్తిన చల్లుకున్నారు. ముప్కాల్ పంప్‌హౌస్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన సొంత ఖర్చుతో రైతులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్‌పై రివర్స్ పంపింగ్ ప్రక్రియను చూస్తూ రైతులు భోజనం చేస్తూ చర్చించుకున్నారు.
రైతులు సంతోషపడుతున్నారు
రాష్ట్రంలో రైతులు బాగుండాలనే సదుద్దేశంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం. పది రోజులుగా కాళేశ్వరం నీటితో శ్రీరాంసాగర్‌ను నింపుతుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. రైతుల మేలు కోసం ప్రాజెక్టును చేపట్టిన సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
– బి.రాజేశ్వర్, పిప్రి
బోర్లు బాగా పోస్తున్నాయి
వరదకాలువలో కొద్దిరోజులుగా నీరు నిండుగా ఉండడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో బోర్లు బాగా పోస్తున్నాయి. పంటల సాగుకు ఎటువంటి ఢోకా లేదని ధైర్యం వచ్చింది. కాళేశ్వరం నీళ్లు తీసుకువచ్చి ఎస్సారెస్పీలో నింపుతుండడంతో రైతులందరికీ భరోసా కలిగింది. వర్షాలు పడకున్నా దిగులు లేకుండా చేసిన మంత్రి ప్రశాంతన్నకు కృతజ్ఞతలు.
– సాయికుమార్, ముచ్కూర్
రివర్స్ పంపింగ్ నిజంగా అద్భుతమే
ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టి నీటిని పల్లం నుంచి ఎత్తుకు తీసుకరావడం నిజంగా అద్భుతమే. వర్షాలు లేవన్న దిగులుతో ఉన్న మేము.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిని చూడడం సంతోషంగా ఉన్నది. రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాజెక్టులో నీరు నింపుతుండడం చరిత్రలో మరిచిపోలేని రోజులివి.
-రాజయ్య, పల్లికొండ
రుణపడి ఉంటాం..
రైతుల మేలు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం జలాలను ముప్కాల్ పంపుహౌస్ ద్వారా పోచంపాడ్‌ను నింపుతున్నారు. రైతుల కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డికి మా రైతులు రుణ పడి ఉంటారు. ఇక రెండు సీజన్లలో పంటలు సాగుచేసేందుకు నీటి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు.
-గంగం అజయ్, పల్లికొండ
సాగు నీటి కష్టాలు తీరినట్లే
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపుతుండడంతో ఇక రైతులకు సాగునీటి కష్టాలు తీరినట్లే. 36 మోటర్లు నడిపించి 300 కిలోమీటర్ల నుంచి నీటిని తీసుకవచ్చి శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపుతున్నారు. రైతులకు ఇంతకన్నా ఏం కావాలి. రైతు వ్యవసాయం చేసుకోవాలంటే నీళ్లే ముఖ్యం. ఆ నీళ్లను ప్రతి ఎకరాకు అందిస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– గంగాధర్ గౌడ్, పిప్రి
బాబ్లీ ప్రాజెక్టు నీటి కోసం ఎదురుచూస్తుండె
సంవత్సరంలో మూడు నెలలే తెరిచి ఉండే బాబ్లీ ప్రాజెక్టు నీటి కోసం ఎదురు చూస్తుండే. అక్కడ వర్షాలు పడితేనే ఇక్కడ పోచంపాడ్ డ్యామ్ నిండుతుండే. అసుంటి రోజులు పోయాయి. కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి పోచంపాడ్‌లో నింపుతుండడంతో రైతులకు భరోసా కలిగింది. నీరు అందుతుందన్న ధైర్యంతో ఎలాంటి దిగులు లేకుండా పంటలు సాగుచేసుకోవచ్చు,
-పెద్ద భోజన్న, పిప్రి