నిజామాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. శుక్రవారం నోటిఫికేషన్ జారీ కాగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆయా శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద బారికేడ్లు, బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇది వరకే భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ మేరకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. నవంబర్ 10వ తారీఖు వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగనున్నది. అభ్యర్థుల నుంచి అధికారులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వాటిని ఈ నెల 13న పరిశీలన చేస్తారు. నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఈ నెల 15వ తారీఖున ముగియనున్నది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి తన వెంట నలుగురితో మాత్రమే ఆర్వో కార్యాలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను సులువుగా సమర్పించేందుకు వీలుగా ఆర్వో కార్యాలయాల వద్ద హెల్ప్ డెస్కులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే నామినేషన్ దాఖలుకు సంబంధించి ఆర్వో కార్యాలయాల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మాక్ నామినేషన్ ప్రక్రియను అధికారులు చేపట్టారు.
ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ఘట్టం షురూ కావడంతో ఎలక్షన్ సందడి మొదలైంది. 10వ తారీఖు వరకే నామినేషన్లకు గడువు ఉండడంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు, స్వతంత్రంగా పోటీ చేయదల్చిన వారంతా నామినేషన్ దాఖలుకు సమాయత్తం అవుతున్నారు. ఆర్వో కేంద్రంలో రెండంచెల భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి వాహనాలను కార్యాలయం వైపునకు రానివ్వకుండా పహారా కాస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు తమ పేరిట ఏ రోజు ముహూర్తం బాగుందనే విషయమై జాతకాలను చూసుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థుల పేర్లు ఖరారైన వారంతా నామినేషన్లను దాఖలు చేయడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటున్నారు. నవంబర్ 3 నుంచి 10వరకు నామినేషన్లను స్వీకరించనుండగా నవంబర్ 5న ఆదివారం సెలవు రోజు వస్తోంది. ఈ రోజున నామినేషన్లను స్వీకరించరు. దీంతో మిగిలిన ఏడు రోజుల్లో శుక్రవారం గడువగా… ఇంకా ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
నామినేషన్లకు సంబంధించి ఫారమ్‌ను ఆర్వో కార్యాలయం నుంచి ఉచితంగా పొందొచ్చు. లేదంటే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక అభ్యర్థికి 4 నామినేషన్ల వరకు వేర్వేరు సెట్లుగా దాఖలు చేయవచ్చు. రెండు ఫొటోలను అఫిడవిట్, నామినేషన్ పత్రాలపై అతికించాలి. జనరల్ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వీరు ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీ అభ్యర్థికి ఆ నియోజకర్గంలోని ఒక ఓటరు ప్రతిపాదించినా సరిపోతుంది. రిజిష్టర్డ్ పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థులకు కచ్చితంగా ఆ నియోజకవర్గం లో 10 మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆర్వో కార్యాలయం గదిలో ఉన్న గడియారం సమయమే ప్రామాణికంగా పరిగణిస్తారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. చివరి రోజున మధ్యాహ్నం 3గంటలలోపు వచ్చే వారికి అధికారి సంతకంతో స్లిప్ అందిస్తారు. సమయం దాటి వస్తే అనుమతించరు. అభ్యర్థులు, ప్రతిపాదించేవారు ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు ఉండరాదు. ఒక వేళ బకాయి ఉంటే నామినేషన్‌ను తిరస్కరిస్తారు.
ఖలీల్‌వాడి/కామారెడ్డి, నవంబర్ 3 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి రోజైన శుక్రవారం మొత్తం తొమ్మిది నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు, కామారెడ్డి జిల్లాలో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల నుంచి 5 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు.
నిజామాబాద్ అర్బన్ నుంచి వైఎస్సాఆర్ కాంగ్రెస్ నుంచి మహ్మద్ మన్సూర్‌అలీ, బీజేపీ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ, వైఎస్సాఆర్ టీపీ నుంచి మిర్యాల్కర్ జయప్రకాశ్ నామినేషన్లు వేశారు. ఆర్మూర్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీనివాస్, బోధన్‌లో ఏఐఎంఐఎం నుంచి మహ్మద్ షర్జీల్ పర్వేజ్ నామినేషన్లు వేశారు. బాన్సువాడ, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గంలో ఒక్క నామినేషన్ కూడా రాలేదని తెలిపారు.
కామారెడ్డి నియోజకవర్గంలో శుక్రవారం నామినేషన్లు దాఖలు ప్రారంభం అయ్యాయని జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. మొదటి రోజు 4 నామినేషన్లు దాఖలు కాగా జుక్కల్,ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా వెంకన్న గుగులోత్, ఆరోళ్ల నరేశ్, చిట్టిబోయిన సులోచనా రాణి నామినేషన్లు దాఖలు చేయగా, బీఎస్పీ నుంచి సురేశ్ గౌడ్ ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు.