కామారెడ్డి, అక్టోబర్ 28 : పాస్‌పోర్టు విచారణలో నిర్లక్ష్యం వహించిన భిక్కనూరు పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్సై నర్సయ్య, రామారెడ్డి పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిపై అధికారులు వేటు వేశారు. వారిద్దరిని సస్పెండ్ చేస్తూ ఇన్చార్జి డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్సై నర్సయ్య గతంలో డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తుండగా ఒక పాస్‌పోర్టు దరఖాస్తుపై విచారణలో నిర్లక్ష్యం వహించారు.
వెంకట్ రెడ్డి కూడా డీఎస్‌బీలో పనిచేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తుల పాస్ పోర్టు దరఖాస్తు విచారణలో బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించారు. క్రిమినల్ కేసులు, ఎన్‌బీడబ్ల్యూస్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రాథమిక విచారణ చేయకుండానే ముగ్గురికి పాస్‌పోర్టు జారీ చేయడానికి ఇద్దరూ క్లియరెన్స్ ఇచ్చారు. ఈ విషయం ఎస్పీ రాజేశ్చంద్ర చంద్ర దృష్టికి రావడంతో విచారణ చేపట్టి నివేదికను ఇన్చార్జి డీఐజీకీ పంపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఇన్చార్జి డీఐజీ ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.