కేసీఆర్ హయాంలో మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు మెరుగైన వైద్యసేవలు అందాయి. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేసీఆర్ ప్రత్యేక చొరవతో వినూత్నమైన పథకాలు ప్రజల దరికి చేర్చారు. ఒకప్పుడు ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే నానుడి నుంచి ‘నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానాన’కు అనే రీతిగా వాటిని తీర్చిదిద్దారు. వైద్యారోగ్య శాఖలో కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి వైద్యాధికారుల వరకు గుర్తింపు దక్కింది. ఆశ కార్యకర్తల సేవలకు ఎప్పటికప్పుడు గుర్తింపునిస్తూ ప్రోత్సాహకాలను అందించి ఎంతగానో మేలు చేసింది.
మోదీ ప్రభుత్వం వారి జీతాలను చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం పలు దఫాలుగా వేతనాలు పెంచుతూ వారిని ప్రోత్సహించింది. ఆశ వర్కర్ల శ్రమను గుర్తించి వారికి సాంకేతిక అండదండలు కల్పించింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆశ కార్యకర్తలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎన్నికలకు ముందు భారీ హామీలతో వారి ఓట్లను కొల్లగొట్టిన హస్తం పార్టీ .. ఇప్పుడు వారిని రోడ్డున పడేసింది. హామీలను అమలుచేయాలని అడిగితే పోలీసులతో దాడులు చేయించి, నిర్బంధాలకు గురి చేస్తోంది.
హామీల అమలు కోసం ఉద్యమం
నిజామాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, వైద్య సేవలను అందించడంలో కీలకపాత్ర పోషించే ఆశ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా పోరాటం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశవర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంతోపాటు వారి ప్రధాన డిమాండ్ అయిన రూ.18వేల వేతనాన్ని ఇస్తామని చెప్పి, ముఖం చాటేసింది. వారికి ఇచ్చిన హామీలను అమలుచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. దీంతో ఆశ వర్కర్లు తమ నిరసన గళాన్ని వినిపించేందుకు ఉద్యమానికి సిద్ధమయ్యారు. రెండురోజుల క్రితం చలో హైదరాబాద్ చేపట్టగా.. రాజధానికి వెళ్లకుండా ఉమ్మడి జిల్లాలోని ఆశ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. తమ సమస్యలను పరిష్కరించే వరకూ తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.
కొండంత అండగా కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో ఆశ కార్యకర్తలకు నెలకు రూ.1500 మాత్రమే అందించేవారు. జీతాల పెంపు కోసం రోడ్డెక్కి ధర్నాలు చేసినప్పటికీ నాటి పాలకులు పట్టించుకోలేదు. వీరి సేవలను కనీసం గుర్తించ లేదు . స్వరాష్ట్రంలో తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం కేసీఆర్ ఆశ వర్కర్లకు జీతాలను భారీగా పెంచారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే వేతనాన్ని రూ.3వేలకు, అక్కడి నుంచి రూ.7,500లకు పెంచారు. రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన అవసరం లేకుండానే, దరఖాస్తులిచ్చి దండం పెట్టే బాధలు లేకుండానే మరోమారు వేతనాలను భారీగా పెంచారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సరిసమానంగా పీఆర్సీని అమలు చేయడంతో వారి వేతనం ఇప్పుడు రూ.9,750లకు చేరింది. ప్రధాని మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్లో ఆశవర్కర్లకు అందిస్తున్న జీతం రూ.4వేలు మాత్రమే. గతంలో వారికి జీతాలు సరిగా వచ్చేవి కాదు..రెండు, మూడు నెలలకోసారి మాత్రమే ప్రభుత్వం అందించేది. తెలంగాణలో ఠంఛనుగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బ్యాంకుల్లో జమ అయ్యే విధంగా కేసీఆర్ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఆశవర్కర్లకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. జీతాలు సరైన సమయానికి ఇవ్వకపోవడంతోపాటు వారిని ఆదుకుంటామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం మానేసింది. ఏడాది కాలంగా వేచి చూసిన ఆశకార్యకర్తలు ఇప్పుడుప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. హామీలు అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రాణాలు పణంగా పెట్టి సేవలు..
కరోనా సమయంలో ఆశ వర్కర్లు అందించిన సేవలు వెలకట్టలేనివి. వైరస్ వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో అం తటా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎక్కడో ఒకచోట వైరస్ వెలుగు చూస్తే ఊరంతా బంద్ పాటించే పరిస్థితులు కనిపించాయి. అలాంటి భయానక స్థితిలో ఆశ వర్కర్ల సేవలు అభినందనీయం. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను రక్షించేందుకు విధులు పక్కాగా నిర్వర్తించారు. ఇక రెండు, మూడో వేవ్ల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఫీవర్ సర్వేలోనూ ఆశ వర్కర్లే కీలకంగా వ్యవహరించారు. ఏఎన్ఎంలకు తోడుగా ‘ఆశ’లు సైతం కీలకంగా పని చేశారు. కొవిడ్ -19 సోకిన వారిని నిరంతరం పర్యవేక్షించడం, వారికి ఆరోగ్య జాగ్రత్తలు చెప్పడం, మందులు అందించడం, ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే అప్రమత్తం చేయడంలో ఆశ వర్కర్లు కీలకంగా వ్యవహరించారు.
రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా గతంలో ఆఫ్లైన్లోనే వైద్యారోగ్య శాఖకు నివేదికలను పంపేది. తద్వారా సమయం ఎక్కువగా తీసుకోవడం, నివేదికల సమర్పణకు ఖర్చు మీద పడడం వంటి ఇబ్బందులు ఉండడంతో కేసీఆర్ హయాంలో ట్యాబ్లు అందించి వారి ఇక్కట్లు తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ క్షేత్ర స్థాయిలో ప్రజల ఆరోగ్య వివరాల సేకరణలో ఆశవర్కర్ల పాత్ర ఎంతో కీలకం. వారితో గొడ్డు చాకిరి చేయించుకుంటున్న కాంగ్రెస్ సర్కారు వీరి బాగోగులను అటకెక్కించింది. ఏడాది కాలంగా ఏ ఒక్కరోజు కూడా ఆశ వర్కర్ల పరిస్థితిపై సమీక్షించకపోవడం గమనార్హం. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో రూ.18 వేలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు. పోలీసులతో నిర్బంధాలు విధించినప్పటికీ ఆశ కార్యకర్తలు లెక్క చేయకుండా రేవంత్ రెడ్డి సర్కారుకు ముచ్చెమటలు తెప్పిస్తున్నారు.