గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్య వారధులు.. ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అయ్యేలా చూడడం, పిల్లలకు టీకాలు వేయించడం తద్వారా మాతా శిశు మరణాలు తగ్గించడం వీరి ప్రధాన విధులు. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధుల గుర్తింపులోనూ వీరు అందించిన సేవలు అమోఘం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ దగ్గు, జ్వరం, జలుబు తదితర చిన్నపాటి వ్యాధులకు మందులు అందజేస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, రోగాల కట్టడికి చర్యలు చేపడుతున్నారు. మహిళలు గర్భం దాల్చిన నాటినుంచి డెలివరీ వరకు ప్రతినెలా వారికి తగు సూచనలు చేస్తూ సుఖ ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య రెండింతలు పెరిగాయని చెప్పవచ్చు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ దవాఖానలో గతంలో 20శాతం సుఖ ప్రసవాలు జరగగా, ప్రస్తుతం 60శాతానికి పెరగడానికి ఆశ కార్యకర్తల సేవలే కారణమంటూ దవాఖాన వర్గాలు ప్రశంసిస్తున్నాయి.
-బాన్సువాడ, డిసెంబర్ 16
పల్లెలు, తండాల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆశవర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతే కాకుండా గ్రామాల్లో 18 సంవత్సరాలు నిండి, వివాహం జరిగిన వెంటనే ఆ గ్రామ అంగన్వాడీ కేంద్రాల్లో వివాహం నమోదు తేదీని ధ్రువీకరించేలా చర్యలు చేపడతారు. మహిళలు గర్భం దాల్చినట్టు అనుమానం వచ్చిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష చేయించి గర్భిణిగా ధ్రువీకరిస్తారు. వెంటనే 12వారాలకు చెందిన ఎంసీపీ కార్డు అందజేసి గర్భిణిగా నమోదు చేస్తారు. అనంతరం టీటీ ఇంజక్షన్ ఇప్పించి, అదే రోజున కేసీఆర్ కిట్ కోసం ఆన్లైన్లో పేరు నమోదు చేయిస్తారు.
మొదటి నెల నుంచే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి రక్తం, యూరిన్, థైరాయిడ్ పరీక్షలు చేయించి, కాల్షియం, ఐరన్ మాత్రలను అందజేస్తారు. మొదటి నెల నుంచి తొమ్మిది నెలల వరకు చుక్కలతో కూడిన బొమ్మను నింపేలా కార్డును గర్భిణికి అందజేసి, నిత్యం మాత్రలను వేసుకుంటూ, చుక్కలను కలపాలని అవగాహన కల్పిస్తారు. దీంతో తల్లి కడుపులో బిడ్డ ఎదుగుల కనబడేలా చివరి వరకు బొమ్మ తయారు అవుతుంది. ఇక మూడో నెల నుంచి గర్భిణి ఇంటికి ప్రతి రోజూ వెళ్లి సుఖప్రసవం జరిగేందుకు దోహదపడే సూచనలు, యోగా ఆసనాలు, చిట్కాలను వివరిస్తారు. మూడో నెలలోనే కేసీఆర్ కిట్‌లో భాగంగా రూ.3వేల నగదును గర్భిణి బ్యాంక్ అకౌంట్లో జమ చేయిస్తారు.
గర్భం దాల్చిన మొదటి నుంచే అంగన్వాడీలో పేరు నమోదు చేయిస్తారు. ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందించే పౌష్టికాహారం తినేలా కృషిచేస్తారు. 7, 8, 9 నెలల్లో గర్భిణులను 102 అమ్మఒడి ప్రభుత్వ వాహనంలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఏరియా దవాఖాన, లేదా మాతాశిశు దవాఖానలకు తీసుకెళ్లి గైనకాలజిస్టును కలిసి దగ్గరుండి పరీక్షలు చేయిస్తారు. టిఫా స్కానింగ్ చేయించి, తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా తెలియజేస్తారు. 9 నెలలు నిండగా (ఎల్ఎంపీఈడీ) పుస్తకంలో ఎంట్రీ చేయిస్తారు. తొమ్మిదో నెల మొదటి వారంలోనే గర్భిణి డెలివరీ తేదీని వారి కుటుంబీకులకు వివరిస్తారు. అక్కడి నుంచి ప్రతి రోజూ గర్భిణిని ఇంటి మనిషిగా నిత్యం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
నొప్పులు వచ్చిన వెంటనే 108 వాహనంలో మాతాశిశు, ప్రభుత్వ ఏరియా దవాఖానలకు తీసుకెళ్తారు. అంతేకాకుండా దవాఖానకు తీసుకెళ్లిన గర్భిణి డెలివరీ అయ్యాక బీపీ, హెచ్చు తగ్గులను పరిశీలించి, పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టిస్తారు. అక్కడే ఉండి తల్లీబిడ్డల సంరక్షణ చర్యల్లో భాగంగా పుట్టిన బిడ్డ కలర్, బాలింతకు బ్లడ్ బ్లీడింగ్ వంటి కార్యక్రమాలను చేపడతారు. డెలివరీ అయిన తల్లులను మూడు రోజులకు అమ్మఒడి వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చేలా చర్యలు తీసుకుంటారు.
డెలివరీ అయిన మహిళను 3, 4, 7, 14, 21, 28, 42 రోజుల్లో వారి ఇంటికి వెళ్లి తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. పుట్టిన బిడ్డకు 16 నెలల వయసు వచ్చాక (డీపీటీ) బూస్టర్ ఇంజక్షన్తోపాటు చుక్కల మందును వేస్తారు. బిడ్డకు ధనుర్వాతం, మెదడు వాపు, తెల్లమచ్చలు వంటివి రాకుండా నివారణ చర్యలు చేపడతారు. బిడ్డ సంరక్షణలో భాగంగా చిన్నప్పటి హెపటైటిస్(బీ) చుక్కలమందును కామెర్ల వ్యాధి నివారణ కోసం వేయిస్తారు. ఓపీవీ, ఐపీవీ వేయించి ఓరల్, వాయిల్ పోలియో నివారణ చర్యలు వివరిస్తారు.
ఆశవర్కర్లు గ్రామాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయం. ఆశ కార్యకర్తలు వచ్చాక ప్రభుత్వ దవాఖానల్లో సుఖ ప్రసవాలు జరిగేలా విశేషంగా కృషి చేస్తున్నారు. బాన్సువాడ దవాఖానల్లో గతంలో 20శాతం జరిగే సుఖ ప్రసావాలు.. ప్రస్తుతం 60శాతానికి చేరుకున్నాయి. ఇందుకు ఆశవర్కర్లు గ్రామీణ ప్రజల్లో కల్పిస్తున్న అవగాహనే ప్రధాన కారణం. పౌష్టికాహారం నుంచి మొదలుకొని ప్రభుత్వం అందించే కేసీఆర్ కిట్, బీపీ, షుగర్ ట్యాబ్లెట్ల కిట్లు, రోగ నిర్ధారణ పరీక్షలు తదితర అంశాల్లో వారి పని ఆదర్శణీయం.
– పోచారం శ్రీనివాసరెడ్డి, స్పీకర్
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, తల్లీబిడ్డల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించడంలో ఆశలదే మొదటిస్థానం. గర్భం దాల్చిన నుంచి డెలివరీ అయి బిడ్డ ఏడాదిన్నర వయస్సు వచ్చే వరకు ఆశ కార్యకర్తలు బాధ్యతగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సేవలపై, సుఖ ప్రసవాలపై గర్భిణులకు అవగాహన కల్పిస్తారు. గర్భిణులకు ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా దవాఖానకు తీసుకెళ్లి తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు.
– సరళా శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్, బోర్లం