బాన్సువాడ టౌన్, జనవరి 10: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గంలోని ఆశ కార్యకర్తలు శుక్రవారం బాన్సువాడలోని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడించారు. పట్టణంలోని ప్రధాన రహదారి నుంచి పోచారం ఇంటి వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటి ఎదుట బై ఠాయించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు ఖలీల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది ముగిసినా ఆశ వర్కర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని మండిపడ్డారు.
అధికారంలోకి రాగానే ఆశ వర్కర్లకు రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ. 5 లక్షలు, ఇన్సురెన్సు రూ. 50 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే హామీలను అటకెక్కించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు భగవాన్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ల సంఘం అధ్యక్షురాళ్లు పల్లవి, విజయ, సుమలత పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ ఆశ కార్యకర్తలు ఎల్లారెడ్డి క్యాంపు ఆఫీస్లో వినతిపత్రం ఇచ్చారు.