ఖలీల్‌వాడి, జూలై 18 : రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనకు కౌంట్‌డౌన్ మొదలైందని, కాంగ్రెస్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నా రు. తెలంగాణ సమాజం ఏవగించుకుంటున్నా సీఎం రేవంత్‌రెడ్డి తీరు మారలేదని మండిపడ్డారు. తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ పాలనలో పచ్చబారి, వలసల పీడ నుంచి బయటపడిన పాలమూరు గడ్డ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి బీఆర్ఎస్ పదేండ్ల అభివృద్ధి, సంక్షేమ పాలనపై విషం కక్కారని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
తన చేతకానీ పాలనలో చెప్పుకోవడానికి ఒక్క మంచి పని లేక దిక్కుతోచని రేవంత్.. నోటి దురదకు సానబెట్టి తెలంగాణ ఆత్మగౌరవానికి మచ్చ తెస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ నోటి దురద సీఎం కుర్చీకే తీరని కళంకమని పేర్కొన్నారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని తిట్టందే రేవంత్‌కు పూట గడవదని, కేసీఆర్ స్మరణ లేకుండా ఆయనకు నిద్ర కూడా పట్టదన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేసే దమ్ము లేకనే కేసీఆర్‌పై అక్కసుతో రేవంత్‌రెడ్డి నిత్యం నోరు పారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రశ్నించే వారిపై బూటకపు కేసులు, అక్రమ నిర్బంధాలు అమలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.