కంఠేశ్వర్/ఖలీల్‌వాడి, జూన్ 2: తెలంగాణ దేవుడు, రాముడు కేసీఆరే అయితే తెలంగాణ లంకాసురుడు రేవంత్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ నైజం జై తెలంగాణ అయితే.. రేవంత్ ఇజం నై తెలంగాణ అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మం త్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం వినాయక్‌నగర్‌లో ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ రూపం తెలంగాణ చిత్రపటమని అభివర్ణించారు. 32 పార్టీలను ఒప్పించి రాష్ర్టాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ అని, ఆయనను మించిన తెలంగాణ ఉద్యమకారుడు మరొకరు లేరనిపేర్కొన్నారు. కేసీఆర్ అంటే ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో సంతోషమని, కాంగ్రెస్ అంటే ప్రతి ఇంట్లో సంక్షోభం, ప్రతి కంట్లో విషాదమని వ్యాఖ్యానించారు.
అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదా ? అని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా రోడ్లపై ధాన్యం రాసులు, రైతన్న గోసలు కనిపిస్తుంటే సీఎం అందాల పోటీల్లో మునిగిపోయారన్నారు. అన్నదాతలపై ఇంత అక్క సా రేవంత్ అని మండిపడ్డారు. కష్టపడి రాష్ర్టాన్ని సాధిస్తే, తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించని వ్యక్తి సీఎంగా వచ్చి రాష్ర్టాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారన్నారు. రోడ్లపై ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావు, మాజీ నగర మేయర్ నీతూకిరణ్, నాయకులు బాజిరెడ్డి జగన్, ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.