ఖలీల్‌వాడి, ఏప్రిల్ 24: నిజామాబాద్ జిల్లాతో బీఆర్ఎస్ది పేగు బంధమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పార్టీకి తొలి అధికార పదవిని అందించిన చరిత్ర నిజామాబాద్ జిల్లాదని గుర్తుచేశారు. మళ్లీ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో, కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయడంలో కూడా ఇందూరు జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు.
గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తితో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా గులాబీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ‘ఇందూరు జిల్లా పంతం, ఇందిరమ్మ హింసారాజ్యం అంతం’ అనే దీక్షతో వరంగల్ బాటపడదా మన్నారు.
సమైక్యాంధ్ర పాలనలో ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ‘ఆర్మూర్ ప్లీనరీ పంతం, తెలంగాణ సొంతం, సమైక్య పాలన అంతం’ అనే నినాదంతో పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు కూడా వరంగల్ రజతోత్సవ సభ స్ఫూర్తిగా ఆర్మూర్ నియోజక వర్గంలో ‘గులాబీ ఆర్మీ పంతం -దుష్ట కాంగ్రెస్, భ్రష్ట బీజేపీల అంతం’ అనే దీక్ష చేపడదామని అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవాన్ని తెలంగాణ ఇంటి పార్టీ పండుగగా ఆయన అభివర్ణించారు. ఓరుగల్లు పొరుగడ్డకు తండోప తండాలుగా తరలివెళ్లి, కేసీఆర్ నాయకత్వానికి అండగా నిలుద్దామని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మూరు టూ వరంగల్ గులాబీమయం చేద్దామన్నారు. నేతలు, కార్యకర్తలు గులాబీ దుస్తులు ధరించి కదం తొక్కాలని కోరారు.
హామీ ఇవ్వక పోయినా 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11వేల కోట్లు ఖర్చుపెట్టి కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేసిన ఘనత తెలంగాణ తొలిసీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత చేప పిల్లలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కంటి వెలుగు, అమ్మ ఒడి, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం ఇలా అనేక పథకాలు చెప్పకపోయినా అమలు చేశామని జీవన్‌రెడ్డి వివరించారు. రుణమాఫీ, రైతు భరోసా, కల్యాణ లక్ష్మి, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు, 24గంటల కరెంట్, ఇంటింటికీ మిషన్ భగీరథ జలాలు, మెరుగైన వైద్యం, సర్కారు విద్యా సంస్థల్లో సౌకర్యాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగావకాశాలు, పింఛన్లు మళ్లీ కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాల్సిందేనని స్పష్టం చేశారు.
తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జీవన్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాశ్, శేఖర్, రాజేశ్వర్ రెడ్డి, వెల్మల్ రాజన్న, మచ్చర్ల సాగర్, మస్త ప్రభాకర్, పూజా నరేందర్, ముత్యం, రజనీష్, పోల సుధాకర్, అభిలాష్, ఏజాజ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిది ఒక దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన అని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అనేది తెలంగాణ సకలజనాభిప్రాయమని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణకు స్వర్ణయుగమని, అభివృద్ధి పరుగులు పెట్టిందని గుర్తుచేశారు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో సంతోషం కనిపించిందన్నారు. రాష్ర్టానికి శనిలా దాపురించిన రేవంత్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం మూసీలో కలిసిపోయి ప్రతీ ఇంట్లో సంక్షోభం, ప్రతి కంట్లో విషాదం కనిపిస్తున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ సర్కార్ దుర్నీతికి కేసీఆర్ పదేండ్ల ప్రగతి వైభవం మసకబారుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ఎన్నికల హామీలను పాతరేసిన కాంగ్రెస్.. పదహారు నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు. వరంగల్ బీఆర్ఎస్ సభతో కాంగ్రెస్ సర్కార్ పతనం ఆరంభం కావడం తథ్యమని ఆయన చెప్పారు.