ఖలీల్‌వాడి, మే 1 : కాంగ్రెస్ పాలనలో అసలు ఏ పథకం అమలువుతున్నదో చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి..సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్, ఓవర్సీస్ స్కాలర్షిప్, 24 గంటల కరెంట్, చేప పిల్లలు, గొర్రెల పంపిణీ, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా,క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లు, దళిత బంధు, దూప దీప నైవేద్యం, వేద పండితులకు గౌరవ భృతి తదితర పథకాలను అమలుచేస్తున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను చర్చకు రమ్మనే స్థాయి రేవంత్‌కు లేదని స్పష్టం చేశారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి అవుట్ సోర్సింగ్ సీఎం అని పేర్కొన్నారు.
ఆయనది ఒరిజినల్ కాంగ్రెస్ బ్రాండ్ కాదని, అసలు అడ్రస్ ఆర్ఎస్ఎస్ అని, కరెప్ట్ కోసం కాంగ్రెస్‌కు షిప్ట్ అయ్యాడని విమర్శించారు. చంద్రబాబుకు రేవంత్ ముద్దుల చిట్టినాయుడు అని, బడేబాయ్ మోదీకి ఇష్టమైన చోటేబాయ్ అని అన్నారు. సీఎం కావడానికి రేవంత్ ఆడని అబద్ధం లేదని, చేయని మోసం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ, చంద్రబాబుకు మొక్కి, ఒర్జినల్ కాంగ్రెస్ నేతలను తొక్కి సీఎం సీట్లో కూర్చున్నాడని అన్నారు. చీమలు పెట్టిన పుట్టలోకి దూరిన పాము అని పేర్కొన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జెంటిల్ మ్యాన్ అని, రేవంత్ మెంటల్ మ్యాన్ అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆంధ్ర భజన చేయడంలో ఆరితేరిండని ఎద్దేవా చేశారు.తెలంగాణ రైతులకు ఆంధ్రోళ్లు వ్యవసాయం చేయడం నేర్పారని పీసీసీ చీఫ్ అవమానించారని మండిపడ్డారు. ఇంకా నయం మన గౌడన్నలకు కూడా కల్లు గీయడం ఆంధ్రోళ్లే నేర్పించారనలేదన్నారు. రేవంత్‌రెడ్డిది టీడీపీ భజన, చంద్రబాబు జపమన్నారు. తెలంగాణకు స్వాతంత్య్రం ఇచ్చింది టీడీపీ అంటాడని, తెల్లన్నం తింటుంటే ఎన్టీఆర్, హైటెక్ సిటీ చూస్తే చంద్రబాబు గుర్తుకొస్తున్నాడంటున్నాడని అన్నారు. రేవంత్‌రెడ్డి ఎప్పటికైనా అన్నం పెట్టిన కాంగ్రెస్ చేతికి సున్నం పెట్టడం ఖాయమన్నారు.
రేవంత్ ఎప్పటికైనా తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదమని హెచ్చరించారు. ఇకనైనా ఆంధ్ర భజన మానుకొని పాలనపై దృష్టి పెట్టాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్, పార్టీ నాయకులు రాంకిషన్‌రావు, సత్యప్రకాశ్, సుజిత్‌సింగ్ ఠాకూర్, పూజా నరేందర్, పోల సుధాకర్, సుంకరి రవి, రాజేశ్వర్‌రెడ్డి, శంకర్, రాజన్న, మోహన్, రజనీష్, రవి, నవీన్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ సభ చూసి రేవంత్ మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. సభకొచ్చిన జనాన్ని చూసి లాగు తడుపుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తెలంగాణ విలన్ అన్నందుకే కేసీఆర్ మీద పడి ఏడుస్తున్న రేవంత్.. మరి సోనియాగాంధీని బలిదేవత అన్నప్పుడు సిగ్గు లేదా ? అని ప్రశ్నించారు. రేవంత్‌కు ఆయన కుటుంబ సౌఖ్యం తప్ప తెలంగాణ ముఖ్యం కాదన్నారు. సభలో కేసీఆర్ తన పేరు ఉచ్చరించలేదని అక్కసు పెంచుకున్నాడని అన్నారు.
ప్రజలే రేవంత్ పేరు ఉచ్చరించడంలేదని, చివరకు మంత్రులు జూపల్లి, పొన్నం, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్ కూడా పలు సందర్భాల్లో రేవంత్‌రెడ్డి పేరు మరిచిపోయారని గుర్తుచేశారు. ఈ మధ్య హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కూడా రేవంత్ పేరు గుర్తుకు రాలేదన్నారు. ఎక్కడైనా ఆయన పేరెత్తితే జనమే కొట్టేట్టున్నారని పేర్కొన్నారు. పేరు చెప్పని వారిపై కక్ష సాధిస్తున్నాడని ఆరోపించారు. ఇదొక మానసిక రోగమని, రాహుల్‌గాంధీ వెంటనే రేవంత్‌ను దవాఖానలో చేర్పించాలని సూచించారు. చరిత్ర గతినే మార్చిన కేసీఆర్‌పై అవాకులు చెవాకులా పేలితే ఊరుకునేది లేదన్నారు.
రేవంత్‌కు రాజకీయ సమాధి కట్టడానికి కొడంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహించాలని, ఎవరు ఎవరికి సమాధి కడతారో తెలుస్తుందన్నారు. కేసీఆర్ తత్వం అభివృద్ధికి పునాది అని, రేవంత్ తత్వం అభివృద్ధికి సమాధి అని పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడమంటే మళ్లీ తెలంగాణను ఆంధ్రలో కలపడమేనని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చేరిపేయడం ఎవరి తరం కాదన్నారు. రేవంత్‌రెడ్డికి పెట్టడానికి చేతులు రావని, కానీ తిట్టడానికి బూత్ లోస్తాయన్నారు.