ఖలీల్‌వాడి, జూన్ 29 : ఎల్లో మీడియా తెలంగాణలో తిష్ట వేసి జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తూ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా, కేసీఆర్ ఫ్యామిలీ ప్రతిష్టను మసకబార్చేలా బ్లేమ్ గేమ్ ఆడుతున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మెంటల్ సీఎం చంద్రబాబు, రెంటల్ సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో నడుస్తున్న పచ్చమీడియా కంపు తెలంగాణకు తలవంపుగా మారిందని పేర్కొన్నారు. ఆంధ్రా పత్రికలు, టీవీలు కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్‌గా చేసుకుని విషపు రాతలు రాస్తున్నాయని, తప్పుడు కథనాలు చూపిస్తున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎల్లో మీడియా గోబెల్స్ గేమ్ షోకు రేవంత్, చంద్రబాబులే స్పాన్సర్స్ అని పేర్కొన్నారు.
తెలంగాణ విధ్వంసానికి రేవంత్‌రెడ్డి, చంద్రబాబు జాయింట్ ఆపరేషన్‌కు తెర తీశారని, పచ్చమీడియా, బీజేపీ కూడా ఈ కుట్రలో భాగస్వామని నిప్పులు చెరిగారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లో ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా దుష్ప్రచారం సాగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దగుల్బాజీ ఛానెల్లో కేటీఆర్‌పై ప్రసారం చేస్తున్న నీచమైన కట్టుకథలను అన్నం తినే ఎవరైనా జర్నలిజం అంటారా ? అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ ప్రతిష్టను దెబ్బ తీసేలా, వ్యక్తిగత జీవితాన్ని కించపర్చేలా ఎల్లో మీడియా అబద్ధాలు వండి వారుస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసు బాస్ చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకోవడానికి తెలంగాణకు భస్మాసుర హస్తం, ఆంధ్రకు అభయహస్తం అందిస్తున్నారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. గోతికాడి గుంటనక్క కాంగ్రెస్ జిత్తుల మారి రాజకీయం ఇక సాగదన్నారు. బీఆర్ఎస్ ఉద్యమశక్తిని చూపెడతామని, పడిపోతున్న తెలంగాణను మళ్లీ నిలబెడుతామని పేర్కొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ జోలికొస్తే తెలంగాణ రాష్ట్ర పొలిమేరలు దాటిపోయేలా తరిమికొడతామని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.