ఖలీల్‌వాడి, ఆగస్టు 8 : ఉద్యమ నేత, తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ జోలికొస్తే కాంగ్రెస్‌కు ఉప్పు పాతరేస్తామని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న తీరు డెమోక్రసీ కాదని హిపోక్రసి అని ధ్వజమెత్తారు. ఏ మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తి లేకుండా కపటత్వ ఎత్తుగడలతో పొంతన లేని కామెంట్లు చేస్తున్న రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కేసీఆర్‌కు పెద్దశిక్ష అని, ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో స్వీయ నిర్బంధంలో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యంలో జయాపజయాలు సహజమని పేర్కొంటూ ఎన్నికల్లో ఓడిపోవడం ఎలా పెద్దశిక్ష అవుతుందో రేవంత్‌కే తెలియాలని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ ఏ రాష్ట్రంలో అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ ఓటమి పాలవుతుందని తెలిపారు. గతంలో ఇందిరాగాంధీతో పాటు అమేథీ రాయబరేలీ స్థానాల్లో రాహుల్, కొడంగల్‌లో రేవంత్ కూడా ఓడిపోయారని జీవన్‌రెడ్డి గుర్తు చేస్తూ వారి ఓటమి కూడా కాంగ్రెస్‌కు పడిన పెద్ద శిక్షలేనా ? అని నిలదీశారు.
ఎప్పటికీ గెలవలేని తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ర్టాల్లో కాంగ్రెస్‌కు మరణశిక్ష పడినట్లు భావించాలా ? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ప్రిజనరీ అని, రాష్ట్రం సాధించిన ఉద్యమ యోధుడు, తొలి సీఎం కేసీఆర్ గొప్ప విజనరీ నేత అని అభివర్ణించారు. ఓటుకు నోటు కేసులో చంచల్‌గూడ జైలు జీవితం గడిపిన అనుభవం రేవంత్‌రెడ్డికి ఉన్నదని అందుకే ఆయన పసుపు కళ్లకు ఎర్రవెల్లి ఫార్మర్ హౌస్ కూడా చర్లపల్లి జైలులా కనిపిస్తోందని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేతిలోని కట్టె తుపాకీ చూసి గువ్వలు భయంతో ఎగిరిపోతాయామో కానీ గులాబీ గుండెలు చెదరవని ఆయన వ్యాఖ్యానించారు.