ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 12: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు ఆత్మబంధువు అని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట రాబంధువుగా మారిందని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రైతుల పాలిట శనిలా దరి చేరిందని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలన రైతులకు స్వర్ణయుగమని, వారికి కష్టాలు లేకుండా చేసిన యోధుడని తెలిపారు. ఆర్మూర్‌లో పర్యటించిన మంత్రి వాకిటి శ్రీహరి యూరియాకు సంబంధించి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. రైతులను కలిస్తే మంత్రికి వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. యూరియా కొరతపై కట్టుకథలు చెబుతూనే 50 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి సాధించిందేమిటని ప్రశ్నించారు. సమైక్యపాలనలో దండగలా మారిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చిన ఘనత కేసీఆర్‌దే అని తెలిపారు.
ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా నీటిని తీసుకువచ్చి బీడు భూములను పంట పొలాలుగా, పచ్చ తోరణాలుగా మార్చారని కొనియాడారు. రైతుల గుండెల్లో కేసీఆర్ నిలిచిపోతారని తెలిపారు. ఆయన అమలుచేసిన సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటైనా అమలుచేసిందా అని ప్రశ్నించారు. రైతుల ఉసురుతాకి కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని రైతులు కోరుకుంటున్నారని తెలిపారు.