ఖలీల్‌వాడి, జూలై 9: రాష్ట్ర రైతాంగానికి ఎవరేం చేశారో తేల్చుకుందామని సవాల్ విసిరిన సీఎం రేవంత్‌రెడ్డి.. కేటీఆర్‌తో చర్చకు భయపడి పలాయనం చిత్తగించాడని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సాక్షిగా సీఎంతో చర్చించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడంతో.. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పారిపోవడాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మాట మార్చడం, ప్రజలను ఏమార్చడం రేవంత్ నైజమని, రచ్చ చేయడం తప్ప.. ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించడం ఆయనకు తెలియదని పేర్కొన్నారు. సీఎం రాకున్నా.. ఏ మంత్రి కూడా చర్చకు రాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిదర్శనమని తెలిపారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతులుగా వెలుగొందారని, కాంగ్రెస్ రైతులకు పట్టిన బూజు అని నిప్పులు చెరిగారు. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరతతో రైతాంగం సతమతమవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు.
ఆధార్ కార్డు మీద ఇచ్చే ఒక్క యూరియా బస్తా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టి పడిగాపులు కాస్తున్న దృశ్యాలు చూస్తుంటే సమైక్యాంధ్ర పాలకుల రోజులు మళ్లీ వచ్చాయనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అన్నదాతల చేతికి సున్నం పెడుతూ గురువు చంద్రబాబు కోసం కృష్ణ, గోదావరి నీళ్లను ఏపీకి ధారాదత్తం చేస్తున్న రేవంత్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారన్నారు. ఇక్కడి లగచర్ల నుంచి అక్కడి బకనచర్ల వరకు రేవంత్‌ది కుట్రకోణమేనని మండిపడ్డారు. పదవిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పెద్దల చుట్టూ, కేసుల మాఫీకి బీజేపీ నేతల చుట్టూ తిరగడం రేవంత్‌కు దినచర్యగా మారిందని తెలిపారు. కాలం చెల్లిన కాంగ్రెస్ కనుమరుగయ్యే రోజు దగ్గర్లోనే ఉన్నదని, రేవంత్‌రెడ్డి మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.