నిజామాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి సీజన్ ముగియడంతో రైతులు వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ధాన్యం విక్రయాలు పూర్తయిన వారు పొలాలను చదునుచేసుకుంటున్నారు. వరుణదేవుడు కరుణిస్తే జూన్ నెలలోనే వరి నాట్లు వేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వానలు ఆలస్యమైతే గడ్డుపరిస్థితులను ఎదుర్కొనే రైతును ఆదుకునే వారు లేకుండాపోయారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మినహాయిస్తే అనేక చోట్ల చెరువుల్లో నీళ్లు లేవు. ఇరిగేషన్ శాఖ ప్రాథమిక సమాచారం మేరకు నిజామాబాద్ జిల్లాలో 993 చెరువులున్నాయి.
ఇందులో దాదాపుగా సగం చెరువుల్లో 25శాతం అంచున నీళ్లున్నాయి. మిగితా వాటిల్లో నీటి జాడ కరువైంది. కామారెడ్డి జిల్లాలో 1514 చెరువులుంటే ఇక్కడ కూడా అదే దుస్థితి నెలకొన్నది. 20శాతం చెరువుల్లోనే 25శాతానికి పైగా నీళ్లు ఉండగా మిగిలిన వాటి పరిస్థితి దయనీయంగా ఉన్నది. పదేండ్ల కేసీఆర్ పాలనలో చెరువుల్లో ఏడాదిపొడవునా జలకళ కనిపించేది. కాలంతో సంబంధం లేకుండా రైతులకు సాగు బలం ఉండేది. నిత్యం జలకళతో కాలువలు, తటాకాలు నిండు కుండను తలపించేవి. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఇప్పటివరకూ ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
ప్రధాన ప్రాజెక్టులూ వెలవెల
ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్లోనూ నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1060 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.23 టీఎంసీలు ఉన్నది. వారం రోజులుగా 1736 క్యూసెక్కులతో వరద వస్తుండడంతో కాసింత నీటి నిల్వలో పెరుగుదల నమోదైంది. మొన్నటి వరకు ఎస్సారెస్పీలో ప్రమాదకరంగా నీటి నిల్వ దాదాపుగా ఆరు టీఎంసీల వరకు చేరింది. గతేడాది జూన్ 1నుంచి మే 18 వరకు 291.088 టీఎంసీలు ఇన్ఫ్లో వచ్చి చేరింది.
287.253 టీఎంసీలు అవుట్ ఫ్లో కొనసాగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలను మిషన్ భగీరథకు వినియోగించుకోగా మిగిలిన నీళ్లను అత్యంత జాగరూకతతో సాగుకు వాడుకునే అవకాశాలున్నాయి. వానాకాలంలో వర్షాల రాక ఆలస్యమైతే ఎస్సారెస్పీ నుంచి నీళ్లను విడుదల చేయడం కూడా గగనంగా మారవచ్చని అధికారులు భావిస్తున్నారు. మంజీరా నదిపై ఉన్న చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టులోనూ నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.508 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 1405 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి 1392 అడుగులకు నీటి నిల్వ చేరింది. మరో రెండు వారాల్లో ఈ నీటి నిల్వ స్థాయి మరింత తగ్గే ప్రమాదం ఉంది. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో దాదాపుగా రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా..భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
వానలు ఆలస్యమైతే గడ్డు పరిస్థితులే..
వానాకాలం సీజన్లో వర్షాలు ఆలస్యమైతే గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. వరి నాట్లు ఆలస్యమయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తోంది. వానలు లేకపోతే రైతులు ఆగమాగమయ్యే పరిస్థితి నెలకొన్నది. వానలు కురువకపోతాయా ? అనే ధైర్యంతో పంటల సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. కుంటలు, తటాకాలు, వాగులు, వంకలు, ప్రాజెక్టులు ఇలా ఎక్కడ చూసినా నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. జూన్ నెలలోపే ఈశాన్య రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.
పలు ప్రాంతాల్లో రైతులంతా వరుణ దేవుడిపైనే భారం పెట్టుకుని కాలం వెళ్లదీసే పరిస్థితులున్నాయి. పుటం మడులు వేసుకుని నాట్లకు సిద్ధమవుదామనుకునే వారికి భూగర్భ జలాలు కూడా అందుబాటులో లేకుండాపోయాయి. మరోవైపు కాలువల ద్వారా నీళ్లు అందే పరిస్థితి కూడా కనిపించడం లేదు. యాసంగి 2024-25 సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాలో సగానికి ఎక్కువ మందికి సాయం అందలేదు. వానాకాలం ముంచుకొస్తున్న ఈ సమయంలో సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. వానాకాలంలోనైనా రైతుభరోసా వస్తుందా? అని రైతులు ఆందోళన చెందుతున్నారు.