నందిపేట్, జనవరి 15: సీఎం రేవంత్‌రెడ్డి వరెస్ట్ పాలనలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అరెస్ట్‌ల పర్వం కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆరోపించారు. హోంమంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బం ధాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీస్‌స్టేషన్‌లా ? కాంగ్రెస్ కార్యాలయాలా ? లేక కాంగ్రెస్, బీజేపీల భజన మందిరాలా ? అని నిలదీశారు. అక్కడ మోడీది ఈడీ పాలన, ఇక్కడ రేవంత్‌ది ఏసీబీ, జేసీబీ పాలన అని, కాంగ్రెస్, బీజేపీలు ప్రజాకంటకం, ప్రాణసంకటంగా మారాయని ఆరోపించారు. బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీలు విషం కక్కుతున్నాయని, ఇదే నా మోడీ సుపరిపాలన ? ఇదేనా రేవంత్‌రెడ్డి ప్రజాపాలన ? అని ధ్వజమెత్తారు.
ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ల్లో ప్రధానమైనవి తొమ్మి ది అని.. ఏడాది గడిచినా ఒక్కటి కూడా అమలు చేయలేదని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నదన్నారు. రాకేశ్‌రెడ్డి నిర్వాకంపై రచ్చబండ దగ్గర, చాయ్ దుకాణాల వద్ద ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తు లు ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి హామీల అమలును ప్రశ్నిస్తూ ఆయన నియోజకవర్గానికి రావొద్దని పోస్టర్లు అతికించారన్నారు. ఈ పోస్టర్లతో ఎలాంటి సంబంధం లేకపోయినా నందిపేట పోలీసులు బీఆర్ఎస్ నాయకులైన రాము, విజయ్‌తోపాటు జిల్లావ్యాప్తంగా పలువురిని అరెస్టు చేశారని, ఈ విషయాన్ని ఇన్చార్జి పోలీసు కమిషనర్ సింధూశర్మ దృష్టికి తెచ్చి నిరసన వ్యక్తం చేశామన్నారు.
డీసీపీ బస్వారెడ్డి కాంగ్రెస్ పార్టీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కనుసన్నల్లో పని చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు కొమ్ముకాస్తున్న పోలీసుల పేర్లు పింక్‌బుక్‌లో ఎక్కిస్తున్నామని, వచ్చేది వందశాతం కేసీఆర్ ప్రభుత్వమే అని, అందరి లెక్కలు వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. పోలీసుల తీరు మారకుంటే 60 లక్షల గులాబీ సైన్యం తిరగబడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలుపు మొక్కలను పీకిపారేస్తామని, ఆయా పార్టీల నాయకుల బలుపు తగ్గిస్తామని ఆయన హెచ్చరించారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని జీవన్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.