వినాయక్‌నగర్/కంఠేశ్వర్, ఆగస్టు 9: గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.. రూ.కోట్లల్లో ఆస్తులు.. పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు.. మున్సిపాలిటీలో పని చేసే ఓ ఉద్యోగి ఇంట్లో లభ్యమైన సంపదను చూసి ఏసీబీ అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. నిజామాబాద్ బల్దియా సూపరింటెండెంట్ (ఇన్చార్జి ఆర్వో)గా పని చేస్తున్న దాసరి నరేందర్ పాపం పడింది.
దశాబ్ద కాలంగా కార్పొరేషన్‌ను గుప్పిట పట్టి అక్రమార్జనకు పాల్పడుతున్న అవినీతి ఆనకొండ ఎట్టకేలకు ఏసీబీ వలకు చిక్కింది. సదరు అధికారి దోచుకున్న సంపాదనను చూసి ఆశ్చర్యపోవడం అధికారుల వంతయింది. పట్టుబడిన నోట్లను లెక్కించేందుకే ఐదు గంటలకు పైగా సమయం పట్టిందంటే సారు గారి అక్రమ సంపద ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో అక్రమార్జన ఎప్పుడూ చూడలేదని, ఏసీబీ దాడుల్లో ఇంత మొత్తంలో పట్టుబడడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు.
దశాబ్ద కాలంగా కార్పొరేషన్లో తిష్ట వేసిన నరేందర్ అవినీతికి అంతే లేకుండా పోయింది. ఇతగాడి అక్రమార్జన ఏకంగా ఏసీబీ డీజీపీ సీవీ ఆనంద్ వద్దకు చేరింది. ఆయన ఆదేశాలతో అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. శుక్రవారం తెల్లవారుజామునే నరేందర్, సంబంధీకుల ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు చేశారు.
నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన 25 మంది అధికారులతో కూడిన బృందా లు నరేందర్ ఇల్లు, చాంబర్‌తో పాటు కోటగల్లిలో ఉండే తల్లి నివాసంలో, నిర్మల్ జిల్లాలోని అత్తగారింట్లో సోదాలు నిర్వహించాయి. సుమారు 11 గంటలకు పైగా సాగిన తనిఖీల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. కౌంటింగ్ మిషన్లతో లెక్కించేందు కే ఐదు గంటలకు పైగా సమయం పట్టినట్లు తెలిసింది. రూ.2.93 కోట్ల నగదుతో పాటు రూ.6 లక్షల విలువైన 51 తులాల బంగారం, రూ.1.98 కోట్ల విలువ చేస్తే ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, భార్య, తల్లి పేరిట బ్యాంకుల్లో ఉన్న బ్యాలెన్స్ రూ.1.10 కోట్లను సీజ్ చేశారు.
ఇన్చార్జి ఆర్వో నరేందర్ ఆస్తుల వివరాలు సేకరించేందుకు సోర్స్ రిపోర్టు దాడులు చేశామని ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. అతని ఇంట్లో నుంచి రూ. 6.07 కోట్లకు పైగా నగదు, ఆభరణాలు, బ్యాంకు బ్యాలెన్స్, ఆస్తి పత్రాలను సీజ్ చేశామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఆర్ఐ చాంబర్ నుంచి రూ.90 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నరేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. తనిఖీల్లో నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన ఇన్స్పెక్టర్లు నగేశ్, శ్రీనివాస్, వేణుకుమార్, రమేశ్, వెంకటేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.