నందిపేట్/సుభాష్‌నగర్, సెప్టెంబర్ 15 : గణేశ్ నిమజ్జనానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 17 నిర్వహించనున్న నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర మార్గంలో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నిజామాబాద్‌తో పాటు చుట్టుపక్కల నుంచి వచ్చే భారీ విగ్రహాలను నందిపేట్ మీదుగా ఉమ్మెడ వద్ద గోదావరి నదికి తరలించనున్నారు. గతంలో చిన్నా, పెద్దా వినాయక విగ్రహాలన్నీ బాసర గోదావరి నదికి తరలించారు. నవీపేట్‌కు వెళ్లే మార్గంలో రైల్వేట్రాక్ పై విద్యుత్ లైన్ అడ్డురావడంతో అప్పటి నుంచి భారీ విగ్రహాలను దారి మళ్లించక తప్పడంలేదు.
గతేడాది విగ్రహాలను ఎక్కువ సంఖ్యలో నందిపేట్ లోని వివేకనందా చౌరస్తా నుంచి నవీపేట్ మీదుగా బాసరకు తరలించారు. బాసర కన్నా ఉమ్మెడనే దగ్గర కావడంతో ఈ ఏడాది ఉమ్మెడకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మెడ గోదావరి నది వద్ద అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. వందలాది సంఖ్యలో విగ్రహాలు ఉమ్మెడకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 8 ఫీట్ల లోపు ఉన్న విగ్రహాలు నవీపేట్ మీదుగా బాసరకు, అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ఉమ్మెడకు తరలించనున్నారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఇటీవల ఉమ్మెడ గోదావరి ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నందిపేట్, నిజామాబాద్ ప్రధాన రోడ్డుకు ఇరుపక్కలా అడ్డంగా ఉన్న భారీ వృక్షాల కొమ్మలు తొలగింపుతో పాటు, రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ లైన్ల తొలగింపు, ఉన్న వాటిని ఎత్తు పెంచడం, రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చడం, గతుకులను సరిచేయడం, అవసరం ఉన్న చోట విద్యుత్ లైట్ల ఏర్పాటు తదితర పనులు కొనసాగుతున్నాయి. గోదావరి నది వద్ద వినాయక విగ్రహాలను వంతెన పై నుంచి నదిలో నిమజ్జనం చేసేందుకు మూడు భారీ క్రేన్లను అందుబాటులో ఉంచనున్నారు. నది వద్ద విద్యుత్తు లైట్లను ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్ వినాయకుల బావిలో మూడు ఫీట్లలోపు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని సార్వజనిక్ గణేశ్ మండలి ప్రతినిధులు సూచించారు. గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సాగే రూట్‌మ్యాప్‌ను ఆదివారం వారు విడుదల చేశారు.