నిజామాబాద్ స్పోర్ట్స్, నవంబర్ 11: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిల్లాలో పక్కాగా అమలు చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. నోడల్ అధికారుల పర్యవేక్షణలో సంబంధిత కమిటీల ద్వారా నిరంతర పరిశీలన జరిపిస్తున్నామని వెల్లడించారు. కలెక్టరేట్లో శనివారం ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌతమ్‌సింగ్, సుబ్రా చక్రవర్తి, లలిత్ నారాయణసింగ్ సందు, పోలీసుశాఖ అబ్జర్వర్ రుతురాజ్ ఆధ్వర్యంలో నోడల్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు చేపట్టిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. ఆరు నియోజకవర్గాల పరిధిలో 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. నగదు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. కోటీ 85 వేల విలువ చేసే మద్యం నిల్వలు, సోదాల్లో రూ.3.82 కోట్ల పైచిలుకు నగదును, రూ.78 లక్షల విలువ చేసే బంగారం, వెండి, ఇతర వస్తువులను సీజ్ చేశామని వివరించారు.
ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసి, సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించామని తెలిపారు. 7131 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారని, ఈ నెల 18న ఈవీఎంల రెండో విడుత ర్యాండమైజేషన్ చేపడతామని తెలిపారు. ఆరు నియోజకవర్గాలకు గాను 128 మంది అభ్యర్థులు మొత్తం 230 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. 2,460 మంది సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి నుంచి, అత్యవసర సర్వీసులకు చెందిన మరో 56 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. సీపీ కల్మేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని పరిశీలకుల దృష్టికి తెచ్చారు. నాలుగు అంతర్రాష్ట్ర, ఆరు అంతర జిల్లా, పలుచోట్ల డైనమిక్ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకోసం 1750 స్థానిక సిబ్బందితో పాటు 1200 మంది అదనపు సిబ్బంది కావాలన్నారు.