కామారెడ్డి, జూన్ 12: కామారెడ్డి పట్టణంలో అక్రమ కట్టడాల తొలగింపు వ్యవహారం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదానికి దారితీసింది. హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు బుధవారం కూల్చివేశారు. కేవలం ఒకే కట్టడాన్ని కూల్చివేయడంపై స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మున్సిపల్ కమిషనర్ సుజాతను నిలదీశారు. కాంగ్రెస్ నాయకుల అక్రమ కట్టడాలను వదిలేసి మిగతా వారివి కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బందిపెట్టే పనులు మానుకోవాలని అన్నారు. పట్టణంలోని అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ నాయకుల అక్రమ కట్టడాలను వదిలేసి రాజకీయ కక్షతోనే ఇతర కట్టడాలను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాటిపల్లి స్వయంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఫోన్ చేసి ప్రజల కట్టడాలను కూల్చివేయమని మీరేమైనా ఆదేశించారా? అని అడిగారు. తాను అలా ఏం చెప్పలేదని షబ్బీర్ అలీ సమాధానమిచ్చారు. దీంతో ఎవరు చెబితే కట్టడాలను కూల్చివేశారని కమిషనర్‌ను నిలదీశారు. మున్సిపల్ కార్యాలయంలో కొద్దిసేపు కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ఒకరినొకరు దూషించుకున్నారు. ఎమ్మెల్యే కల్పించుకొని బీజేపీ కౌన్సిలర్లకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం కాంగ్రెస్ కౌన్సిలర్ పాత శివ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే కాటిపల్లి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకున్నది.
పట్టణ అభివృద్ధికి సహకరించాలి
పట్టణ అభివృద్ధిలో భాగంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నట్లు కాంగ్రెస్ కౌన్సిలర్ పాత కృష్ణమూర్తి అన్నారు. అక్రమంగా నిర్మించిన వసుధ హోటల్ని కూల్చి వేతను ఎమ్మెల్యే అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఇది రాజకీయ కుట్ర కాదని, ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసుల ప్రకారమే మున్సిపల్ అధికారులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారని అన్నారు.అప్పుడు నోటీసులు ఇచ్చి ఇప్పుడు కూల్చివేయవద్దనడం సరైంది కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ కా మారెడ్డి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు.