Chain Snatching | వినాయక నగర్, డిసెంబర్ 29 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 10న జిల్లా కేంద్రంలో జరిగిన రెండు చైన్ స్నాచింగ్ ఘటనలు మరవకముందే కాజాగా సోమవారం మరో ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో ఈరోజు ఉదయం బాశెట్టి బాగిర్తి అనే మహిళ తన ఇంటి ముందు చెట్లకు నీళ్లు పోస్తుండగా ఘటన చోటుచేసుకుంది. హెల్మెట్ ధరించి బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు తెంచుకొని పరారయ్యారు.

బాధితురాలు అరిచినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న దుండగుల దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకొని నిజామాబాద్ ఏసీబీ రాజా వెంకట్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో టౌన్ ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.