కామారెడ్డి, మార్చి 17 : తమ సమస్యలను పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు ఆందోళన బాట పట్టారు. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ సెంటర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట 48 గంటలపాటు మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ.. తమ సమస్యల పరిష్కారానికి సోమ, మంగళవారాలు రెండురోజులపాటు అంగన్వాడీ కేంద్రాలను బంద్ చేసి, ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఐసీడీఎస్ పథకం ప్రారంభమై 50 ఏండ్లు అవుతున్నా సమసలు పరిష్కారానికి నోచుకోవడంలేదన్నారు. ఐసీడీఎస్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ప్రతినెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం వేతనం రూ. 18 వేలకు పెంచాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.