NIZAMABAD | వినాయక్ నగర్, ఏప్రిల్; 18: రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న ఓ వ్యక్తి గొంతు ను మరో గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో కోసి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి.. కథనం ప్రకారం.. ఈనెల 12న రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్ వద్ద రాత్రి సమయంలో కుంచపు బాబు అనే వ్యక్తి నిద్రించాడు. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అతని వద్దకు వచ్చి అకారణంగా గొడవకు దిగి అతనిపై దాడి చేశాడు.
అంతటితో ఆగకుండా దుండగుడు తన వద్ద ఉన్న బ్లేడ్ తో పడుకున్న వ్యక్తి గొంతు కోసి అక్కడి నుండి పారిపోయాడు. తీవ్ర రక్తపు మడుగులో ఉన్న బాబును గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే గొంతు కోసి పారిపోతున్న గుర్తుతెలియని వ్యక్తి అన్నవాళ్లు రైల్వే స్టేషన్ లో గల సీసీ కెమెరా లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి కేసు నమోదు చేసుకుని, కేసును రైల్వే పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మేరకు రైల్వే ఎస్సై సాయి రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్లేడుతో గొంతు కోసి పారిపోయిన ఈ దుండగుడిని గుర్తించిన వారు 8712658591 ఫోన్ నంబర్ కు సమాచారం ఇవ్వగలరని రైల్వే ఎస్సై పేర్కొన్నారు.