బోధన్, మార్చి 9:
కరోనా సంక్షోభం అనంతరం మొదటిసారిగా వందశాతం సిలబస్‌తో ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవకతవకలు, మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్‌కు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు గత గురువారం ముగిశాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ‘నైతికత – మానవ విలువలు’, ‘పర్యావరణ విద్య’పై పరీక్షల నిర్వహణ కూడా పూర్తయ్యింది. ఇక వార్షిక పరీక్షలు ఈ నెల 15న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 54కేంద్రాలను ఏర్పాటు చేయగా 35,017 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 17, 503 మంది ఉన్నారు. వీరిలో జనరల్ విద్యార్థులు 15,215 మంది ఉండగా, ఒకేషనల్ విద్యార్థులు 2,288 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలను 17,514 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరిలో జనరల్ కోర్సుల రెగ్యులర్ విద్యార్థులు 14,084 మంది ఉండగా, 1364 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1936 మంది రెగ్యులర్ విద్యార్థులు, 130 మంది ప్రైవేట్ అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణతను పెంచే దిశగా..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ఈ విద్యాసంవత్సరంలో అనేక చర్యలు తీసుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి కోసం సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించారు. విద్యార్థుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అకడమిక్ మానిటరింగ్ బృందాలను ఏర్పాటుచేశారు. దీంతో ఈసారి ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
నిఘా నీడలో పరీక్షలు
ఇంటర్మీడియెట్ పరీక్షలు సవ్యంగా నిర్వహించేందుకు ఈసారి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్న కళాశాలలనే కేంద్రాలుగా ఎంపికచేశారు. ప్రశ్నాపత్రాల ప్యాకింగ్‌లను ప్రిన్సిపాల్ రూమ్‌ల్లోని సీసీ కెమెరాల ఎదుటే తెరవాల్సి ఉంటుంది. సమాధాన పత్రాల స్కానింగ్, వాటి ప్యాకింగ్ కూడా అదేవిధంగా చేపట్టాలని నిబంధనలు విధించారు. కాపీయింగ్ జరగకుండా తనిఖీలను చేపట్టేందుకు ప్రత్యేకంగా స్కాడ్స్‌ను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించనున్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వీలైనంత తొందరగా చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరని చెబుతున్నారు. కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటుచేయనున్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
ఇంటర్మీడియెట్ పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశాం.. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది ఎంపికలో తగిన జాగ్రతలు తీసుకున్నాం. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతితోపాటు లైటింగ్ సక్రమంగా ఉండేలా చూస్తున్నాం. అన్ని పరీక్షాకేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటుచేస్తున్నాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలి.
– లోకం రఘురాజ్, డీఐఈవో, నిజామాబాద్