బోధన్, ఫిబ్రవరి 4: మండలంలోని మారుమూల గ్రామం ఖండ్గావ్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధి కోసం ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల రూ.50 వేల అర్థికసహాయాన్ని అందించారు. ఈ మొత్తాన్ని ఆమె శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నెమలి సంజీవ్‌కుమార్‌కు ఫోన్‌పే ద్వారా పంపించారు. అమల తన సిబ్బందికి సంబంధించిన ఒక వివాహం కోసం రెండేండ్ల క్రితం గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఈ పాఠశాలను సందర్శించగా, పాఠశాల అభివృద్ధికి సహాయం చేయాల్సిందిగా గ్రామస్తులు ఆమెను కోరారు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకున్న అమల శుక్రవారం పాఠశాల అభివృద్ధి కోసం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని పంపించారు. పాఠశాల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేసిన ఆమెకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.