ఇందూరు, అక్టోబర్ 22 : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటలు వేయడానికి వ్యవవసాయ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశా రు. 2022-23 ఏడాదిలో జిల్లాలో 4,96,279 ఎకరాల్లో పంటలు సాగులక్ష్యాన్ని వ్యవసాయశాఖ అంచనా వేసింది. పంటలతో పాటు అందుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులతో కలిపి పూర్తి యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. ఈ సంవత్సరం సమృద్ధిగా కురిసిన వర్షాలకు జిల్లాలోని జలాశయాలన్నీ నిండుకుండల్లా మారాయి. సాగునీటికి ఢోకా లేకపోవడంతో గత యాసంగి సీజన్ కన్నా ఎక్కువగా పంటలు సాగు చేసే అవకాశమున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది. గతేడాది యాసంగి సీజన్లో 4,71,452 ఎకరాల్లో రైతులు పం టలు సాగు చేయగా, ఈ ఏడాది వ్యవసాయశాఖ మరో 24,737 ఎకరాలు పెంచింది.
వరి, మక్కజొన్న పంటలు గతేడాది కన్నా ఎక్కువ సాగవ్వనున్నట్లు ప్రణాళికలో పేర్కొంది. మినుములు, పెసర్ల పంట సాగు చాలా వరకు తగ్గే అవకాశముంది. యాసంగి పంటలకు అవసరమయ్యే ఎరువులకు అంచనాలు కూడా అధికారులు రూపొందించారు. గతేడాది కన్నా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యే అవకాశం ఉండడంతో ఎరువుల అంచనాలు సైతం పెరిగాయి. యూరియా, డీఏపీ, ఎంవోపీల అంచనాలు 15 శాతం పెంచారు. రూపొందించినా అంచనాలను కలెక్టర్ ద్వారా రాష్ట్రశాఖకు పంపించారు. యూరియా 96,651 మెట్రిక్ టన్నులు, డీఏపీ 26,267, ఎంవోపీ 12,262, కాంప్లెక్స్ 37,427 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
వర్షాలు సమృద్ధిగా కురవడంతో జిల్లాలో యాసంగి సాగుకు నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. కావాల్సిన విత్తనాలు, ఎరువుల కోసం అంచనాలు రూపొందించాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
-ఆర్. తిరుమల ప్రసాద్, నిజామాబాద్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి