ఎల్లారెడ్డి రూరల్, ఫిబ్రవరి 6: గృహజ్యోతి పథకం వర్తింపు కోసం వినియోగదారులు వివరాలు సమర్పించాలని ఉమ్మడి జిల్లా విద్యుత్ అధికారులు కోరారు. మీటర్ రీడింగ్ కోసం వచ్చే సిబ్బందికి ఆధార్, రేషన్ కార్డులు చూపి మీ సర్వీస్ (యూఏఎన్)నంబర్ తో అనుసంధానం చేయించుకోవాలని సూచించారు. గృహాలకు 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామన్న హామీ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. కరెంట్ బిల్లులు తీసేందుకు ఇంటి వద్దకు వచ్చే సిబ్బందికి రేషన్, ఆధార్‌కార్డు వివరాలు ఇస్తే వాటిని సర్వీస్ నెంబర్‌తో అక్కడే అనుసంధిస్తారని విద్యుత్ అధికారులు తెలిపారు. ఆయా వివరాలను అప్డేట్ చేసుకున్న వారు మాత్రమే గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందుతారని వివరించారు.