ఎల్లారెడ్డి రూరల్, నవంబర్ 13 : వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం నెలకొన్నది. సన్నరకాలు కాంటా వేయకుండా దొడ్డు వడ్లనే కొంటుండడంపై అన్నదాతలు ఆగ్రహానికి గురయ్యారు. అదే సమయంలో మిల్లర్లు భారీగా కడ్తా తీస్తుండడం, అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు సిద్ధమయ్యారు. అన్నాసాగర్ కొనుగోలు కేంద్రంలో బుధవారం ధర్నా చేయాలని రైతులు నిర్ణయించగా, విషయం తెలిసి యంత్రాంగం పరుగున తరలివచ్చింది. సమస్యలు పరిష్కరించి సన్న వడ్ల కొనుగోళ్లు ప్రారంభించింది. ఎలారెడ్డి మండల పరిధిలోని అన్నాసాగర్ కొనుగోలు కేంద్రం వద్ద బుధవారం రైతులు ధర్నాకు సిద్ధమయ్యారు. సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. దొడ్డు రకం వడ్లు సంచికి 1.600 కిలోలు ఎక్కువ తూకం వేస్తున్నా మిల్లర్లు లోడ్‌కు 5 క్వింటాళ్ల తరుగు తీస్తున్నారు. మరోవైపు లారీల కొరత తీవ్రంగా ఉండడం, లారీలో లోడ్ చేసిన ప్రతీ సంచికి డ్రైవర్ రూపాయి డిమాండ్ చేయడం.
మిల్లర్లు కడ్తా విధించడంపై విసిగిపోయిన రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేయాలని గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో మెస్సేజ్ పెట్టుకున్నారు. బుధవారం ఉదయమే కొనుగోలు కేంద్రానికి చేరుకుని బైఠాయించేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే ఈ సమాచారం జిల్లా అధికారులకు చేరడంతో అడిషనల్ కలెక్టర్ విక్టర్, అధికారులు ఆగమేఘాల మీద ఉదయమే అక్కడకు చేరుకున్నారు. సన్నబియ్యం కొనకపోవడం, తరుగు తీస్తుండడం, డ్రైవర్ డబ్బులు డిమాండ్ చేస్తుండడంపై రైతులు అధికారులను నిలదీశారు. ‘బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండే. కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చినంక అడ్లు అమ్మేతందుకు మస్తు కష్టమైతుందని’ కర్షకులు మండిపడ్డారు. అడిషనల్ కలెక్టర్ వారిని బుజ్జగించి ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారు. వెంటనే సన్నధాన్యం కొనుగోలును ప్రారంభించడంతో రైతులు శాంతించారు. డీసీవో రామ్మోహన్, డీసీఎస్వో నర్సింహారావు, డీఎం రాజేందర్, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్ మహేందర్, ఎస్సై బొజ్జ మహేశ్, గిర్దావర్ శ్రీనివాస్ తదితరులు తరలివచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సన్న, దొడ్డు ధాన్యమంతా కొనుగోలు చేసేది. అదే ధీమాతో ఈసారి కూడా సన్నవడ్లు పండించినం. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం దొడ్డు వడ్లు కొనుడు మొదలువెట్టింది. మరీ సన్న వడ్లు ఎవరు కొంటరు?. పంట కోసి 20 రోజులు అయిపాయె. వడ్లు అమ్మేదాకా మా బతుకు కల్లాల కాడనే అయితుంది. గింత నిర్లక్ష్యం ఎప్పుడూ సూడలె. అందుకే ధర్నా చేద్దామని డిసైడ్ అయినం. సార్లు వచ్చి సమస్య పరిష్కరిస్తామని చెప్పిండు.
– పెరుగు నాగరాజు, రైతు, అన్నాసాగర్
వడ్లు అమ్ముదామంటే యాడికాడ దోసుకునుడే ఉన్నది. సంచికి కిలో ఆరువందల గ్రాములు ఎక్కువగా జోకుతున్నారు. అయినా రైస్‌మిల్ సేటు లారీకి ఐదు క్వింటాళ్ల తరుగు తీస్తుండు. ఇగ మేము బాగుపడాలంటే యాడికెళ్లి అయితది. కడ్తాతోని నష్టపోతున్నామని సార్లకు చెప్పిచెప్పి యాష్టకచ్చింది. రోడ్డు మీదికొస్తేనే పని అయితదని ఆందోళనకు సిద్ధమైనం. విషయం తెలిసి సార్లు ఉరుకొచ్చిండ్రు.
– సంతోష్‌రెడ్డి, రైతు, అన్నాసాగర్
సన్న అడ్లు కొంటలేరని మా బాధల మేము ఉన్నం. దొడ్డు అడ్లు కాంటా వేస్తున్నారు. సంచికి కిలోన్నర కంటే ఎక్కువ జోకుతున్నా మిల్లర్లు ఇంకా తరుగు తీయవట్టే. పుండు మీద కారం సల్లినట్లు లారీ డ్రైవర్ కూడా పైసలు అంటుండు. సంచికి రూపాయి ఇయ్యమని పోరు పెడుతుండు. అందరూ మామీద పడి బతుకుడే. మరీ మేమెట్ల బతకాలె. అడిషనల్ కలెక్టర్ సార్ వచ్చిండని ఊకున్నం. లేకపోతే మస్తు లొల్లి పెట్టాలె అనుకున్నం.
– సాయిబాబా, రైతు, అన్నాసాగర్