Bodhan | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని పసుపువాగు శివారులోని సర్వే నంబర్ 594 లోని సుమారు 50 నుంచి 60 ఈత చెట్లను శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి, కాల్చి ధ్వంసం చేశారు. గీత కార్మిక సంఘానికి చెందిన తమ భూమిలో ఈత చెట్లను ధ్వంసం చేసి కాల్చి వేసినట్లు సమాచారమందుకున్న బోధన్ గీత కార్మిక సంఘం నాయకులు, గీత కార్మికులు ఈత వనాన్ని పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వనంలో ఈత చెట్ల ద్వారా జీవనోపాధి పొందుతున్న సమయంలో ఈ సంఘటన జరగడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎక్సైజ్ సీఐ భాస్కర్ రావుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు గీత కార్మిక సంఘం నాయకులు, గీత కార్మికులు తెలిపారు. బోధన్ ఎక్సైజ్ సీఐ భాస్కర్ రావు కు ఫిర్యాదు చేసిన వారిలో పీ గంగాధర్ గౌడ్, బీ లింగాగౌడ్, కందుకాల శ్రీకాంత్ గౌడ్, వై జీవన్ గౌడ్, వై రమేష్ గౌడ్, ఏం రాజేందర్ గౌడ్ తో పాటు కల్లు గీత Crystal సంఘం నాయకులు, కల్లుగీత కార్మికులు ఉన్నారు.