కామారెడ్డి, జూలై 2: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల కారాగార శిక్ష, రూ.60వేల జరిమానా విధిస్తూ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వర ప్రసాద్ తీర్పు వెలువరించినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామానికి చెందిన అక్కిరేని శ్రీకాంత్ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేవాడు. అదే గ్రామానికి చెందిన ఓ బాలిక(14)తో పరిచయం పెంచుకున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి 2022 జూలై 2న రాత్రి 10 గంటల ప్రాంతంలో బైక్పై మేడ్చల్ జిల్లా దబిల్పూర్కు తీసుకెళ్లాడు.
అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కనిపించడంలేదని కుటుంబ సభ్యులు మరుసటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సదరు యువకుడు బాలికను జూలై 6న లింగంపేట్ పోలీసుస్టేషన్ వద్ద వదిలేసి పరారయ్యాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. పూర్తి సాక్షాధారాలు సేకరించి కోర్టులో సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగారశిక్ష, రూ.60వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్పీ తెలిపారు.