Kotagiri | కోటగిరి, జూన్ 19 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప, సాయిబాబా ఆలయాల్లో ఈనెల 17న అర్ధరాత్రి ఆలయంలో రెండు హుండీలను చోరీ చేసిన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కోటగిరి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంప్ లో పోలీసులు శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై రాజు వస్తుండగా పోలీసులు అతడిని అనుమానించారని తెలిపారు. కాగా రాజు పరిగెత్తడానికి ప్రయత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకొని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. దీంతో ఇటీవల కోటగిరి శ్రీ అయ్యప్ప సాయిబాబా దేవాలయంలో రెండు హుండీలను తామే చోరీ చేశామని రాజు అంగీకరించాడని ఏసీపీ తెలిపారు. మరో నిందితుడు ఏడుకొండలు ఫరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. బోధన్ మండలం బిల్లాల్ గ్రామానికి చెందిన రాజు, గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మిట్టపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు ఇతను ప్రస్తుతం బీర్కూరు మండలం మల్లాపూర్ నివాసిగా ఉంటున్నాడని వెల్లడించారు.
అయితే ఈ ఆలయాల్లోని రెండు హుండీలను చోరీ చేసి, అందులోని రూ.62వేలు తీసుకుని ఇద్దరు సమానంగా తీసుకున్నట్లు రాజు అంగీకరించాడని, ప్రస్తుతం అతడి వద్ద నుండి రూ.21.660, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాజు, ఏడుకొండలు వీరిద్దరిపై గతంలో బోధన్, డిచ్ పల్లి, కోటగిరిలలో చోరీ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. మరో నిందితుడు ఏడుకొండలు ను కూడా త్వరలో పట్టుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. అరెస్టు చేసిన రాజును రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడిని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న కోటగిరి ఎస్సై శ్రీనివాస్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్ బస్వంతరావు, కానిస్టేబుల్ యాదగిరిని ఏసీపీ శ్రీనివాస్ అభినందించారు. ఈ సమావేశంలో కోటగిరి ఎస్సై శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.